ఐ యామ్‌ టెక్నికల్‌ మ్యాన్‌.. | Ramana Gogula to speak in GE summit attended by Ivanka | Sakshi
Sakshi News home page

ఐ యామ్‌ టెక్నికల్‌ మ్యాన్‌..

Published Sun, Nov 26 2017 9:49 AM | Last Updated on Sun, Nov 26 2017 10:07 AM

Ramana Gogula to speak in GE summit attended by Ivanka - Sakshi - Sakshi

సాక్షి, సిటీబ్యూరో, హైదరాబాద్‌: రమణ గోగుల.. ఈ పేరు చెబితే టాలీవుడ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడిగా, గాయకుడిగానే తెలుగువారికి పరిచయం. కానీ ఆయన అంతకుముందే వ్యాపారవేత్త.. సామాజిక పారిశ్రామికవేత్త. ఎన్నో స్టార్టప్‌ కంపెనీలను ప్రారంభించడమేగాక విజయవంతంగా నడిపించారు. అంతేగాక వందలాది గ్రామాలకు సోలార్‌ ఎల్‌ఈడీ కాంతులు అందించారు. ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థ స్టాన్లీ బ్లాక్‌ అండ్‌ డెక్కర్‌కు చెందిన క్లీన్‌ టెక్నాలజీ విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా సౌరశక్తి ద్వారా రైతులుకు విస్తృత సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రమికవేత్తల సదస్సులో రమణ సౌరశక్తి సాంకేతిక సాధనాల రూపకల్పనతో రైతులకు ఎలా తోడ్పడవచ్చనే అంశంపై రమణ మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా తన మనసులో మాటలను శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. 
 
భవిష్యత్తు సోలార్‌ పవర్‌దే..  
ప్రపంచ భవిష్యత్తు సౌరశక్తి మీదే ఆధారపడి ఉంది. ఆదే ‘క్లీన్‌ ఎనర్జీ’. దీని వల్ల కాలుష్యం ఉండదు.. ఏ నష్టం కలుగదు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ శక్తిని గ్రహించవచ్చు. భవిష్యత్తులో వాహనాలు కూడా సోలార్‌ శక్తితోనే నడుస్తాయి. సోలార్‌ శక్తి మూలం అయితే దానిని వాడుకునే రకరకాల అప్లికేషన్స్‌ తయారవతాయి. చాలా స్టార్టప్స్‌ వీటిపై పనిచేస్తున్నాయి. సౌర శక్తితో రైతులకు ఉపయోగపడే అనేక సాధనాలు రూపొందిచాలనేది మా లక్ష్యం. మేఘాలు, నేల, లిఫ్ట్‌ ఇరిగేషన్, స్టోరేజ్‌.. ఇలా అన్నింట్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించి రైతులుకు ఉపయోగపడే అప్లికేషన్లు తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. క్లీన్‌ టెక్నాలజీ ద్వారా సోలార్‌ అగ్రికల్చర్‌ పంప్స్‌ని అందించే ప్రయత్నం చేస్తున్నాం.  
 
రైతులకు అండగా..  
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతుల పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాం. ఇందుకు టీ–హబ్‌తో ఒప్పందం చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ కంపెనీలతో కూడా పనిచేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం.  
 
వ్యాపార రంగంలో మహిళలు..
నేడు దేశమంతా స్టార్టప్స్‌పైనే దృష్టి పెట్టింది. అందునా మహిళా పారిశ్రామిక వేత్తలపై ప్రముఖంగా దృష్టి సారిస్తున్నారు. మన ప్రభుత్వాలు దేశ, విదేశాల్లో çమహిళా పారిశ్రామిక వేత్తలకు సహకారం అందించడం శుభ పరిణామం. స్త్రీ సాధికరత కుటుంబం నుంచి ప్రారంభమవుతుంది. మహిళలు వారు ఏం చేయాలనుకుంటున్నారో ఆ అంశంలో కుటుంబం తోడ్పడాలి. చాలా కుటుంబాలు ప్రోత్సహిస్తున్నాయి కూడా. సాంకేతిక, సామాజిక రంగాల్లో మహిళా పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. అయితే వీరి సంఖ్య ఇంకా పెరగాలన్నది నా అభిప్రాయం. ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తుల జాబితాలో అంతర్జాతీయ కంపెనీల చీఫ్‌ ఆఫీసర్లు, గ్లోబల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న లీడర్లలో స్త్రీలే కనిపిస్తున్నారు. ఇప్పుడు చాలా రంగాలను స్త్రీలు ముందుండి నడిపే ట్రెండ్‌ కొనసాగుతోంది. అది అన్ని రంగాలకు విస్తరించాలి. వారి ప్రాతినిధ్యం, ప్రాముఖ్యత పెరినప్పుడే దేశ సంపద పెరిగుతుంది.  
 
హైదరాబాద్‌ వైబ్రెంట్‌ సిటీ..
మన నగరం ఎన్నో అంశాల్లో ప్రగతి సాధిస్తోంది. సామాజిక పరిశ్రమలు, టెక్నికల్, ఇన్నోవేటివ్‌.. ఇలా అనేక రంగాల్లో పారిశ్రామిక వేత్తలను ఇక్కడ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక సమ్మిట్‌ జరగడం మనకు గర్వకారణం.
 
నేను ఎప్పడూ టెక్నాలజిస్ట్‌నే..
ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి సాలోర్‌ ఎనర్జీలోను, అమెరికాలోని లూసియానా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశాను. నేను ఎప్పడూ టెక్నాలజిస్ట్‌నే. ఈ విషయం సినిమా రంగం వారికి తెలియదు. నా రక్తంలో టెక్నాలజీ, నా మనసంతా మ్యూజిక్‌ అవి సమాంతరంగా సాగుతుంటాయి. ఒక సమయంలో సంగీతం అందించాను.. చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు నా జీవితం సామాజిక లక్ష్యాలు సాధించడానికి వెచ్చిస్తాను’ అంటూ ముగించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement