కె.బి.రామన్నదొర
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి బుధవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా కె.బి.రామన్నదొర విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా బరిలో దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి ఎం.ఎస్.ప్రసాద్‌పై 213 భారీ మెజారిటీతో గెలుపొందారు. రామన్నదొర 570 ఓట్లు సాధించగా, గట్టి పోటీనిస్తారని భావించిన ప్రసాద్ 359 ఓట్లతో సరిపెట్టుకున్నారు. గతేడాది జరిగిన సంఘం ఎన్నికల్లో దొర స్వల్ప తేడాతో ఓడిపోగా, ఈ సారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రసాద్ అధ్యక్ష బరిలో దిగి ఓడిపోవడం ఇది ఐదోసారి. ఓ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ న్యాయవాదులు కొందరు మద్దతు పలికినా కూడా ప్రసాద్ ఓడిపోయారు. ఉపాధ్యక్షుడిగా కె.సీతారాం గెలుపొందారు.
ఆయన తన సమీప ప్రత్యర్థి ఎస్.ఎం.సుభాన్‌పై 105 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండు కార్యదర్శుల పోస్టులకు 8 మంది పోటీ పడగా, ఇందులో కాలవ సురేశ్‌కుమార్‌రెడ్డి, ఎం.ఆర్.కె చక్రవర్తి (రిషి) విజయం సాధించారు. కాలవ సురేశ్‌కు 483 ఓట్లు రాగా, చక్రవర్తికి 383 ఓట్లు వచ్చాయి. సురేశ్ వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక సంయుక్త కార్యదర్శిగా కడియం నీలకంఠేశ్వరరావు విజయం సాధించారు. కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి గెలుపొందారు. పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు హైకోర్టు ప్రాంగణంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,700 ఓట్లకు గాను 1,260 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment