Lawyers Association
-
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను గౌరవిస్తాము: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండేందుకు విశాఖను ఒక రాజధానిగా చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బార్ ప్రతినిధులు ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను తాము గౌరవిస్తామని, కానీ రైతులను అడ్డం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ మాఫియాను మాత్రం సహించబోమని చెప్పారు. ఉత్తరాంధ్రవాసులు ఎప్పుడూ రాజధానికి దూరంగానే ఉన్నారని, ఇన్నాళ్లకు దగ్గరగా రాజధాని ఏర్పాటుకు అవకాశం వచ్చిందని, దాన్ని జారవిడుచుకోవద్దని చెప్పారు. ఉత్తరాంధ్రలో రాజధాని ఉంటే భావితరాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. అధికార వికేంద్రీకరణ అవసరాన్ని ఆ కమిటీ సూచించిందన్నారు. పెద్ద క్యాపిటల్ ఈ రాష్ట్రానికి పనికిరాదని చెప్పిందన్నారు. చంద్రబాబు అందుకు భిన్నంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత కమిటీ నివేదికల ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపారు. srikaరాజధాని ఏర్పాటుకు ముందు చంద్రబాబు దొనకొండ, నూజివీడు అంటూ రోజుకో పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాలకు అనుగుణంగా రాజధాని ప్రకటన చేశారని తెలిపారు. ఆ రోజు జీ టు జీ ఒప్పందం జరిగిందని చెప్పారని, కానీ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అది నిజం కాదని చెప్పారని అన్నారు. మన ప్రాంత ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు ఉద్యమాల్లో కీలక పాత్రను పోషించాలని కోరారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫల్గుణరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వాసుదేవరావు, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ నాయకులు ఎమ్మెస్ వినయ్ భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎల్‌ను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) చేసిన తీర్మానాన్ని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు కె.రామజోగేశ్వరరావు ఖండించారు. బుధవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. సీజేఐ ఎదుట పెండింగ్‌లో ఉన్న ఓ అంశాన్ని ఖండిస్తూ ప్రకటనలు జారీ చేయడం సమంజసం కాదన్నారు. ఐఏఎల్ లెటర్ హెడ్‌పై ఖండన తీర్మానాన్ని పంపారని, ఆ లెటర్ హెడ్‌పై తన పేరు కూడా ఉందని పేర్కొన్నారు. అయితే, ఆ తీర్మానానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐఏఎల్ చేసిన తీర్మానం గురించి సంఘం ప్రతినిధులు తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఐఏఎల్‌ను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ కృష్ణయ్యర్ మహోన్నత ఉద్దేశంతో ప్రారంభించిన ఈ సంస్థకు న్యాయకోవిదుడు సి.పద్మనాభరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారని, అలాంటి సంస్థ స్థాయిని దిగజార్చేశారని వాపోయారు. ప్రజలు, న్యాయవాదుల హక్కుల కోసం పోరాడాల్సిన సంస్థను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. స్వప్రయోజనాలను ఆశించి కొందరు సంస్థ పేరిట అలాంటి తీర్మానాలు చేస్తున్నారన్నారు. -
ముగిసిన న్యాయవాదుల సమావేశం.. కీలక నిర్ణయాలు
సాక్షి, గుంటూరు: దళిత ప్రజాప్రతినిధులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ న్యాయవాదుల సంఘం నిర్వహించిన సమావేశం శనివారం ముగిసింది. రాజధానిలో దళిత ప్రజాప్రతినిధుల దాడులపై.. నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్న వైనంపై గుంటూరులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్‌లపై జరిగిన దాడులను న్యాయవాదుల సంఘం ఖండించింది. త్వరలోనే న్యాయవాదుల జేఏసీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లోని ప్రజల్లోని దళితులకు రక్షణ లేదని వారు ఆందోళ వ్యక్తం చేశారు. కాగా వారికి రక్షణ ఉండేందుకు రాజధానిలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకే రక్షణ లేనప్పుడు అమరావతిలో శాసనసభను నిర్వహించటం అనవసరమన్నారు. శాసన సభను కూడా అమరావతి నుంచి మరోచోటకు తరలించాలని న్యాయవాదుల సంఘం సూచించింది. -
న్యాయవాదులపై వరాల జల్లు
సాక్షి, ఏలూరు (సెంట్రల్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రకటించిన మేనిఫెస్టోలో న్యాయవాదులకు చోటు కల్పించడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 10 వేల మంది న్యాయవాదులు ఉండగా వారిలో 4 వేల మంది వరకు జూనియర్ న్యాయవాదులు ఉన్నారు. సీనియర్ న్యాయవాదులతో పాటు, జూనియర్ న్యాయవాదులకు పలు సంక్షేమ ఫలాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జూనియర్ న్యాయవాదులకు మొదటి మూడు సంవత్సరాల ప్రాక్టీస్ పిరియడ్‌లో ప్రతి నెల రూ.5 వేలు స్టైఫండ్ ఇవ్వడంతో న్యాయవాదులకు హెల్త్ కార్డులు మంజూరు, ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు.ఆ నిధికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు తక్కువ ధరకే ఇళ్లస్థలాలు ఇవ్వడం, న్యాయవాది చనిపోయిన సమయంలో ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా రూ.3 లక్షలను రూ.10 లక్షలకు పెంచడం ద్వారా న్యాయవాది కుటుంబాలకు భరోసా కల్పించడం అవుతుందని పలువురు సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. స్టైఫండ్ పెంపు అభినందనీయం న్యాయవాద వృత్తికి వచ్చిన కొత్తలో సీనియర్ న్యాయవాది దగ్గర జూనియర్‌గానే చేయాలి. అప్పుడు చాలాకాలం పాటు కేసులు ఉండకపోవడంతో కష్టంగా మారుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూనియర్ న్యాయవాదులను గుర్తించి, ప్రాక్టీస్ పిరియడ్‌లో జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్‌ను రూ. వెయ్యి నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం అభినందనీయం. – దొండపాటి శౌరి, జూనియర్ న్యాయవాది టీడీపీకి గుణపాఠం చెబుతాం గత ఎన్నికల ముందు చంద్రబాబు న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చారు. వాటిని ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. న్యాయవాదులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గతంలో విజయవాడలో ధర్నా చేసేందుకు సిద్ధం అయిన సమయంలో అప్పుడు మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. తిరిగి ఎన్నికలు వచ్చిన న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. న్యాయవాదులందరూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగిన గుణపాఠం చెబుతాం. – తేతలి శశిధర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది -
అన్ని లోక్‌సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం
-
ఏపీ హైకోర్టు న్యాయవాదులసంఘం అధ్యక్షుడిగా రామన్నదొర
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి బుధవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా కె.బి.రామన్నదొర విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా బరిలో దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి ఎం.ఎస్.ప్రసాద్‌పై 213 భారీ మెజారిటీతో గెలుపొందారు. రామన్నదొర 570 ఓట్లు సాధించగా, గట్టి పోటీనిస్తారని భావించిన ప్రసాద్ 359 ఓట్లతో సరిపెట్టుకున్నారు. గతేడాది జరిగిన సంఘం ఎన్నికల్లో దొర స్వల్ప తేడాతో ఓడిపోగా, ఈ సారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రసాద్ అధ్యక్ష బరిలో దిగి ఓడిపోవడం ఇది ఐదోసారి. ఓ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ న్యాయవాదులు కొందరు మద్దతు పలికినా కూడా ప్రసాద్ ఓడిపోయారు. ఉపాధ్యక్షుడిగా కె.సీతారాం గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఎస్.ఎం.సుభాన్‌పై 105 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండు కార్యదర్శుల పోస్టులకు 8 మంది పోటీ పడగా, ఇందులో కాలవ సురేశ్‌కుమార్‌రెడ్డి, ఎం.ఆర్.కె చక్రవర్తి (రిషి) విజయం సాధించారు. కాలవ సురేశ్‌కు 483 ఓట్లు రాగా, చక్రవర్తికి 383 ఓట్లు వచ్చాయి. సురేశ్ వైఎస్సార్సీపీ మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక సంయుక్త కార్యదర్శిగా కడియం నీలకంఠేశ్వరరావు విజయం సాధించారు. కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి గెలుపొందారు. పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు హైకోర్టు ప్రాంగణంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,700 ఓట్లకు గాను 1,260 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
నేడే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలు
అధ్యక్ష బరిలో రేసు మహేందర్‌రెడ్డి.. జెల్లి కనకయ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం (టీహెచ్‌సీఏఏ) ఎన్నికలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో కొత్త కార్యవర్గ ఎన్నిక కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సంఘం అధ్యక్ష స్థానా నికి రేసు మహేందర్‌రెడ్డి, జెల్లి కనకయ్యలు పోటీపడుతున్నారు. ఉపాధ్యక్ష పదవికి సురేందర్‌రెడ్డి, మహ్మద్ ముంతాజ్ పాషా, జలగం సంపత్‌కుమార్, కార్యద ర్శుల పోస్టులకు ఏడుగురు బరిలో ఉన్నారు. సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఈసీ మెంబర్ల పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ప్రాంగణంలో ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు పోలింగ్ జరుగనుంది. దాదాపు 6 వేల మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు. -
బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మల్లికార్జున గెలుపు
- మహిళా ప్యానల్ ఓటమి - ప్రభావం చూపిన ‘నోటా’ అనంతపురం లీగల్: అనంత న్యాయవాదుల సంఘం కార్యవర్గానికి బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా బి.మల్లికార్జున విజయం సాధించారు. ఆయనకు 144 ఓట్లు పోల్ కాగా, ఈశ్వరికి 96, జనార్దన్‌కు 75 ఓట్లు వచ్చాయి. నోటా కింద 9 ఓట్లు పోలయ్యాయి. మూడు ఓట్లు చెల్లలేదు. కాగా, ఉపాధ్యక్ష స్థానానికి జి.పద్మజ, కోశాధికారిగా ఎం.శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రధాన కార్యదర్శి స్థానానికి రాజేంద్రప్రసాద్, రామాంజనేయ చౌదరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా రాజేంద్రప్రసాద్ 18 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ స్థానానికి 22 ఓట్లు నోటాకు పడ్డాయి. కార్యదర్శిగా గెలుపొందిన జయమోహన్ 165 ఓట్లు సాధించగా, మహిళా ప్యానెల్ అభ్యర్థి బి.సుజనకు 135 ఓట్లు, 22 ఓట్లు నోటాకు పడగా, 5 ఓట్లు చెల్లలేదు. కేఎస్ జయరాం మెమోరియల్ గ్రంథాలయ కార్యదర్శిగా బాలకృష్ణ 208 ఓట్లు సాధించి గెలుపొందారు. మహిళా ప్యానెల్ అభ్యర్థి మేడా అనూరాధకు 98 ఓట్లు పడగా 17 ఓట్లు నోటాకు 4 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎన్నికల నిర్వహణ అధికారులుగా సీనియర్ న్యాయవాదులు పీఎల్ ఈశ్వరరెడ్డి, రాజారాం, రాంకుమార్, గురుప్రసాద్‌లు, సహాయకులుగా శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌రావు, నరసింహులు(చిట్టి), జాఫర్సిద్దిఖి వ్యవహరించారు. కేవలం 20 మంది మాత్రమే ఉన్న మహిళలు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలు తమ ఉనికిని చాటాయన్నారు. రాయలసీమ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాల్మీకి గంగాధర్ విజేతలకు అభినందనలు తెలిపారు. న్యాయవాది కృష్ణవేణి ఓటుపై వేటు తాను సభ్యత్వ రుసుం చెల్లించినా ఓటు లేదనటంపై న్యాయవాది కృష్ణవేణి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 వరకు సభ్యత్వం ఉండేలా 2012 డిసెంబరులోనే ముందస్తుగా రుసుం చెల్లించాలనంటూ రసీదు చూపించినా ఫలితం లేకపోయింది. ఆమె సభ్యత్వం వివరాలున్న పేజీని కొట్టి వేసినందున ఓటుహక్కు ఇవ్వలేమని ఎన్నికల అధికారులు తెగేసి చెప్పారు. మాజీ అధ్యక్షుడు జి.నరసింహులు ఆమె సభ్యత్వాన్ని నిర్ధారించినా ఫలితం లేకపోయింది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన జి.పద్మజ ఓటు వినియోగించుకోవటానికి ఆమెను అనుమతించాలని కోరినా ససేమిరా అనటంతో విధిలేక కృష్ణవేణి వెనుతిరిగారు. బార్ అసోసియేషన్ సభ్యత్వ లెడ్జరులో తనకు సంబంధించిన వివరాల కొట్టివేతకు కారణాలు చూపాలని డిమాండు చేశారు.