
రామన్నపేట పోలీసులకు హ్యాట్సాఫ్
రామన్నపేట: దేశవ్యాప్తంగా పలు నేరాలకు పాల్పడి జిల్లాలో వరుసగా ముగ్గురు పోలీసులను పొట్టనపెట్టుకున్న సిమి తీవ్రవాదులు మహ్మద్ ఎజాజ్, అస్లాం ఆయూబ్‌లను మట్టుపెట్టిన ఘనత రామన్నపేట పోలీసులకే దక్కింది. శుక్రవారం అర్ధరాత్రి పొద్దుపోయే దాక వెహికల్ చెకింగ్ నిర్వహించిన సీఐ ఎ.బాలగంగిరెడ్డి శనివారం ఉదయం మోత్కూర్, అర్వపల్లి పరిసరాల్లో ముష్కరులు సంచరిస్తున్నారని సమాచారం తెలుసుకొని గన్‌మెన్ జానకిరామ్‌తోపాటు, రామన్నపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన బి.వెంకటేశ్వర్లు, ఎన్.నిరంజన్ అనే కానిస్టేబుళ్లను వెంట తీసుకొని ప్రైవేటు వాహనంలో డ్రైవర్ శ్రీనుతో కలిసి మోత్కూరు బయలుదేరారు.
మోత్కూరు మండలం జానకీపురం శివారులో ఆత్మకూరు(ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ముష్కరులు సీఐపై కాల్పులకు తెగబడగా ఆయన వాహనంలోనే ఉన్న గన్‌మెన్ జానకిరామ్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, నిరంజన్ అగంతకులపై బుల్లెట్ల వర్షం కురిపించి మట్టుపెట్టారు. ఆ క్షణంలో వారు సమయస్ఫూర్తిని ప్రదర్శించనట్లయితే ఇంకా ప్రాణనష్టం జరిగేదని తెలుస్తుంది. ముష్కరులను మట్టుపెట్టింది రామన్నపేట పోలీసులేనని తెలుసుకొని స్థానికులు అభినందించారు.