మంగళవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి కిరీట ధారణ చేస్తున్న జీయర్‌స్వామి
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం కనుల పండువగా జరిగింది. రామాలయం సమీపంలోని మిథిలా స్టేడియంలో గల శిల్ప కళాశోభితమైన కల్యాణ మండపంలో మంగళవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఈ వేడుక చూసిన భక్తులు పులకించిపోయారు. రామాలయ ప్రాంగణంలోని యాగశాలలో ఉదయం చుతాస్థానార్చన హోమం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారిని సుందరంగా అలంకరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరి ప్రదక్షిణగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మవార్లను కల్యాణ మండపంపై వేంచేయింపజేసి, ముందుగా విష్వక్సేన పూజ చేశారు. అనంతరం శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో పట్టాభిషేక మహోత్సవ క్రతువును నిర్వహించారు. వేడుకలో వినియోగించే ద్రవ్యాలకు దేవస్థానం అర్చకులు పుణ్యాహవచనం గావించారు. ఆ తర్వాత కలశాలలో పోసిన చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థ జలాలకు ప్రోక్షణ చేసి భక్తులతో పాటు ప్రాంగణంలోని నలు దిక్కులా చల్లారు. అభిషేకానికి వీలుగా కలశ స్థాపన చేశారు. రామదాసు కాలం నాటి ఆభరణాలైన బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి, కిరీట ధారణ చేశారు. తర్వాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషిక్తుడిని చేశారు. భద్రాచలంలో జరిగే ఈ వేడుక విశిష్టతను వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు.
రాముడన్నా.. నారాయణుడన్నా ఒక్కరే
పూజల వివాదంపై చినజీయర్ స్వామి
శ్రీరాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు
భద్రాచలంలో నిర్వహించే పూజలపై కొంతమంది వివాదం చేయటం తగదని చినజీయర్ స్వామి అన్నారు. మంగళవారం భద్రాచలంలో శ్రీసీతారాముల వారికి నిర్వహించిన పట్టాభిషేక వేడుకలో పాల్గొన్న ఆయన.. భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. శ్రీరాముడు లోకకల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. రాముడన్నా.. నారాయణుడన్నా ఒక్కరేనని, అనాదిగా వస్తున్న నియమాలను అనుసరించటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
భద్రాచలంలో కొంతమంది ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయటం తగదన్నారు. ఏ నియమాన్ని ఏర్పరుచుకున్నామో, దాన్నే అనుసరించాలని, ఈ విషయంలో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ఇలాంటి నియమాల ప్రకారమే భద్రాచలంలో పూజలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. నియమాల పరిరక్షణకు భక్తరామదాసు వారసులమై స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. ఇదే విషయాన్ని భక్తులందరితోనూ చెప్పించారు. ఆలయ వ్యవస్థకు మూలమైన రామానుజుల వారు కూడా ఇదే చెప్పారని జీయర్ గుర్తు చేశారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని ఆయన చెప్పారు. రాముడు అవతరించిన విళంబి నామ సంవత్సరంలో ఈ ఏడాది పట్టాభిషేకం నిర్వహించడం ఎంతో విశేషమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment