బ్లాక్‌లో రేషన్ బియ్యం | ration rice in black market | Sakshi
Sakshi News home page

బ్లాక్‌లో రేషన్ బియ్యం

Published Mon, Oct 6 2014 1:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

బ్లాక్‌లో రేషన్ బియ్యం - Sakshi

బ్లాక్‌లో రేషన్ బియ్యం

సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన రూపాయికి కిలో బియ్యం పక్కదారి పడుతోంది. వేల కోట్ల సబ్సిడీని భరిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న బియ్యం డీలర్ల కక్కుర్తి కారణంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. మూడు నెలల కాలంలోనే అధికారులు 10 వేల క్వింటాళ్ల అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో నిర్వహించిన తనిఖీల్లోనే ఇంత మొత్తం పట్టుబడిందంటే అనధికారికంగా ఏ స్థాయిలో బియ్యం పక్కదారి పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక సబ్సిడీపై అందిస్తున్న కిరోసిన్ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారుల తనిఖీల్లో ఇప్పటి వరకు సుమారు లక్ష లీటర్ల కిరోసిన్ పట్టుబడగా.. దొరకని కిరోసిన్ మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం బియ్యం, కిరోసిన్ అక్రమాలకు కళ్లెం వేసే చర్యలకు దిగాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది. అవసరమైతే ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్ చేసే విధానాలను పరిశీలించాలని సూచించింది.
 
 రూ. కోట్లలో బియ్యం అక్రమాలు
 
 తెలంగాణలో జూన్-ఆగస్టు మధ్య 6,025 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 3,893 క్వింటాళ్ల లెవీ బియ్యం పట్టుబడినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సెప్టెంబర్ గణాంకాలను కలుపుకుంటే మరో 2 వేల క్వింటాళ్ల పీడీఎస్, మరో వెయ్యి క్వింటాళ్ల లెవీ బియ్యం ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. కేవలం 103 చౌక ధరల దుకాణాలు, 22 ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద చేసిన తనిఖీల్లోనే ఇంత పెద్దఎత్తున బియ్యం పట్టుబడటం గమనార్హం. ఇక రాష్ట్రంలోని 15 వేలకు పైగా చౌకధరల దుకాణాల్లో పూర్తిస్థాయి తనిఖీలు చేపడితే ఏపాటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనేది ఊహిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అధికారుల లెక్కల ప్రకారం పట్టుబడిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం సుమారు రూ.4 కోట్లకు పైగా ఉంటుంది.
 
 దొరికింది లక్ష లీటర్లు..
 
 కిరోసిన్ సరఫరాలోనూ అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. రేషన్ కార్డు ద్వారా రూ.15కు లీటరు చొప్పున అందిస్తున్న సబ్సిడీ కిరోసిన్‌కు బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. ముఖ్యంగా ఈ దందా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. జూన్ నుంచి 3 నెలల కాల వ్యవధిలో విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో 98,540 లీటర్ల కిరోసిన్ పట్టుబడింది. ఇందులో జూన్‌లో 48,447 లీటర్లు, జూలైలో 49,329 లీటర్లు, ఆగస్టులో 1,764 లీటర్లు పట్టుబడినట్లు రికార్డులు చెబుతున్నాయి. సెప్టెంబర్‌లో జరిపిన తనిఖీ ల్లోనూ  మరో 10 వేల లీటర్లకు పైగా కిరోసిన్‌ను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మార్కెట్లో వీటి విలువ  రూ.50 లక్షల వరకు ఉంటుంది. అరకొర తనిఖీల్లోనే పెద్దఎత్తున కిరోసిన్ పట్టుబడుతుంటే, వాస్తవంగా ఏ స్థాయిలో కిరోసిన్ దందా జరుగుతుందో ఊహించవచ్చు.
 
 నిఘా పెంచండి..
 
 పీడీఎస్ బియ్యంలో అక్రమాలు, కిరోసిన్ బ్లాక్ మార్కెట్ తరలింపుపై గట్టి నిఘా పెట్టాలని, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఇటీవల విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌర సరఫరాల శాఖలను ఆదేశించింది. బియ్యం గోదాముల నుంచి చౌక ధరల దుకాణాలకు చేరే వరకు ఎక్కడా అక్రమాలు జరగకుండా, అడ్డదారి పట్టకుండా చూడాలని, అవసరమైతే నిల్వ చేసుకున్న మేర స్టాక్ ఉందో లేదో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించింది. చౌక ధరల దుకాణాలను ఎప్పటికప్పుడు సందర్శించి స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించాలని, ఏవైనా అక్రమాలు చోటుచేసుకుంటే డీలర్లపై చర్యలకు వెనుకాడరాదని స్పష్టంచేసింది. ఇదే  సమయంలో రేషన్ కార్డుల ఏరివేతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్న మాదిరే రేషన్ సరుకుల సరఫరా, పంపిణీలో జీపీఆర్‌ఎస్, రేషన్ పోర్టబులిటీ, ఈ-పాస్ వంటి సేవలను విసృ్తతం చేసే చర్యలకు ఉపక్రమించాలని పౌర సరఫరాల శాఖకు సూచించినట్లు తెలిసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement