సాక్షి, హైదరాబాద్: మనిషి బతికున్నప్పుడు గౌరవం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. చనిపోయిన తర్వాత శవానికి గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం. అయితే.. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలకూ దిక్కు లేకుండా పోతోంది. మార్చురీ సిబ్బంది వచ్చిన శవాలకు సకాలంలో పోస్టుమార్టం చేయకపోవడమే కాక.. ఉన్నవాటికీ రక్షణ కల్పించలేక పోతున్నారు. ఫలితంగా పందికొక్కులు, ఎలుకలు శవాలను పీక్కుతింటున్నాయి. డంపింగ్ రూమ్‌లో భారీగా శవాలు పేరుకుపోవడం.. ప్రధాన రహదారికి ఆనుకుని మార్చురీ ఉండటంతో కుక్కలు శవాల కాళ్లు, చేతులు పీక్కుతిన్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఓ శవాన్ని ఎలుకలు, పందికొక్కులు పీక్కుతినడం చర్చనీయాంశమైంది.
సమయం మించిందని అప్పగించి వెళితే..
హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌సాగర్‌కు చెందిన ఉమ(21) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. అప్పటికే సాయంత్రం ఆరు కావడంతో ఫోరెన్సిక్ నిపుణులు విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో యువతి బంధు వులు శవాన్ని మార్చురీ సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి శవాన్ని పరిశీలించగా.. ముక్కు, పెదాలు, మెడ భాగం ఛిద్రమై కన్పించాయి. దీంతో మార్చురీ సిబ్బందిపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు.
కుప్పలుగా శవాలు..
ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మార్చురీ కొనసాగుతోంది. ఇక్కడికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతదేహాలే కాక గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి మెడికో లీగల్ కేసులకు సంబంధించిన శవాలు వస్తుంటాయి. ఇలా రోజుకు సగటున 20–25 శవాలు వస్తుంటాయి. రోజుకు సగటున 15 శవాలకు పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. వీటిని భద్రపరిచేందుకు 32 ్రíఫీజర్ బాక్సులు, ప్రత్యేకంగా ఓ గది ఉన్నాయి. పోస్టుమార్టం తర్వాత మూడు రోజుల వరకు బాడీలను భద్రపరిచే వీలుంది. అప్పటికే బాడీ డీకంపోజ్ అయితే డంప్ రూమ్‌లోకి తరలిస్తారు. బంధువులు శవాలను గుర్తించి తీసుకెళ్లగా, మిగిలిన వాటిని అనాథ శవాలుగా పరిగణించి జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తారు. వీటిని ప్రతి పది రోజులకు ఓసారి సామూహిక దహనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో భారీగా శవాలు పేరుకుపోతున్నాయి.
తగిన బాక్స్‌లు లేకపోవడం వల్లే..
నిర్దేశిత సమయంలో వచ్చిన శవాలకు అదే రోజు పోస్టుమార్టం చేస్తుండగా, సాయంత్రం నాలుగు తర్వాత వచ్చిన వాటిని ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచి, పోలీసుల పంచనామా తర్వాత పోస్టుమార్టం చేస్తున్నారు. పోలీసులు పంచనామా ఇన్‌టైమ్‌లో చేయకపోవడం, బంధువులు సకాలంలో రాకపోవడం వల్ల కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు శవాన్ని బాక్స్‌లోనే ఉంచాల్సి వస్తోంది. ఫ్రిజర్ బాక్సులన్నీ శవాలతో నిండిపోవడంతో ఆ తర్వాత వచ్చిన వాటిని వార్డులో ఓ మూల పడేయాల్సి వస్తోంది. వస్తున్న శవాల నిష్పత్తికి తగ్గట్టు మార్చురీని అభివృద్ధి చేయకపోవడం.. ఎప్పటికప్పుడు శవాలను దహనానికి తరలిం చకపోవడం ఇందుకు కారణాలని వైద్యనిపు ణులు చెపుతున్నారు.
ఉస్మానియా మార్చురీ మూసీ నదిని ఆనుకుని ఉంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి భవనానికి మరమ్మతులు నిర్వహించక పోవ డంతో పందికొక్కులు, ఎలుకలు, కుక్కలకు నిలయంగా మారింది. వీటిని నియంత్రించా ల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిజానికి ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరిచిన శవాలను పందికొక్కులు, ఎలుకలు కొరికే అవకాశం లేదు. బాక్స్‌లో కాకుండా వార్డులో ఓ మూలన పడేస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
శవాలను పీక్కుతింటున్నాయ్..!
Published Wed, Dec 20 2017 1:41 AM | Last Updated on Wed, Dec 20 2017 1:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment