
జీశాన్, కెల్విన్‌లతో సంబంధమేంటి?
హీరో రవితేజపై ఎక్సైజ్ సిట్ ప్రశ్నల వర్షం
డ్రగ్స్ వ్యవహారంలో కీలక నిందితులైన జీశాన్, కెల్విన్‌లతో సంబంధాలకు సంబంధించి హీరో రవితేజపై ఎక్సైజ్ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. జీశాన్‌తో ఎనిమిదేళ్లుగా పరిచయముందని, అతడి నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లుగా తమకు సమాచారముందని కాల్‌డేటా ఆధారంగా నిలదీసినట్లు సమాచారం. అయితే తనకు అసలు డ్రగ్స్ అలవాటు లేదని రవితేజ పేర్కొన్నట్లు తెలిసింది. జీశాన్ ఎవరో తనకు తెలియ దని, కెల్విన్ మాత్రం ఈవెంట్ మేనేజర్‌గా పరిచయమని పేర్కొన్నట్లు సమాచారం.
సాక్షి, హైదరాబాద్ :
డ్రగ్స్ కేసులో సినీహీరో రవితేజ శుక్ర వారం సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయ న ఉదయం 10 గంటల సమయంలో నాంపల్లి లోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకోగా.. 10.30 గంటలకు సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. డ్రగ్స్ దందాలో కీలక నిందితుడైన జీశాన్ నుంచి రవితేజకు, ఆయన సోదరుడు భరత్, డ్రైవర్ శ్రీనివాసరావుకు డ్రగ్స్ అందినట్లుగా సిట్ అనుమానిస్తోంది.
నాకు డ్రగ్స్ అలవాటే లేదు..
జీశాన్‌తో ఎనిమిదేళ్లుగా మీకు పరిచయ ముందని, అతను మీకు డ్రగ్స్ సరఫరా చేశాడని తమ విచారణలో వెల్లడైందంటూ సిట్ ప్రశ్నించగా... అసలు తనకు జీశాన్ అనే వ్యక్తి ఎవరూ తెలియదని రవితేజ సమాధాన మిచ్చినట్లు తెలిసింది. అయితే కెల్విన్ మాత్రం ఈవెంట్ మేనేజర్‌గా తెలుసని, తాను నటించిన పలు సినిమాలకు ఈవెంట్లు చేయడంతో పరిచయమని పేర్కొన్నట్లు సమాచారం. అంతేతప్ప వారి ద్వారా తాను డ్రగ్స్ ఏమీ తీసుకోలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గతంలో భరత్‌పై డ్రగ్స్ ఆరోపణల సందర్భంలో మీ పేరు కూడా వినిపించిందని సిట్ అధికారులు ప్రశ్నించగా... తాను డ్రగ్స్ దందా చేసి ఉంటే అప్పుడే పోలీ సులు తనను అరెస్ట్ చేసేవారు కదా అని రవితేజ పేర్కొన్నట్లు తెలిసింది.
ఇక ‘పూరి మీకు డ్రగ్స్ అలవాటు చేసినట్టుగా సందేహాలు న్నాయి. ఆయనతో మీరు సన్నిహితంగా ఉంటారు? దానికి కారణం డ్రగ్స్ వాడుతుం డటమేనా?..’’అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తన సినీ జీవితంలో తనకు ఇష్టమైన వ్యక్తి పూరి అని.. తన కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడా నికి పూరితో కలసి తీసిన సినిమాలే తోడ్పడ్డాయని రవితేజ పేర్కొన్నట్లు సమా చారం. తనకు డ్రగ్స్ వాడాల్సిన అవసరం లేదని.. సినిమాలు, కుటుంబం తప్ప మరో ధ్యాస లేదని చెప్పినట్టు సమాచారం. తనకు మద్యం అలవాటు మాత్రమే ఉందని, అది కూ డా వారాంతాల్లో తన ఇంట్లో లేదా స్నేహితుల ఇళ్లలోనేనని చెప్పినట్టు తెలుస్తోంది.
రెండు బృందాలు.. 2 గంటలకోసారి..
డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు చేసిన రెండు బృందాలు శుక్రవారం రవి తేజను విచారించినట్లు తెలిసింది. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు ఒక బృందం విచారించగా.. అరగంట విరామమిచ్చి మరో బృందం 2.00 గంటల వరకు ప్రశ్నించింది. తర్వాత భోజన విరామం ఇచ్చిన అధికారులు.. తొలి బృందంతో 2.45 గంటలకు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. తిరిగి 4.30 గంటలకు టీ బ్రేక్ ఇచ్చి, మరో బృందంతో విచారణ కొనసాగిం చారు. రాత్రి 7.30 గంటల సమయంలో విచారణ ముగిసింది. కాగా.. విచారణ అనంతరం పరీక్షల నిమిత్తం రక్తం, గోళ్లు తదితర నమూనాలు ఇచ్చేందుకు రవితేజ నిరాకరించారని సిట్ అధికారులు తెలిపారు.
మరో ఇద్దరిని విచారించిన సిట్
జీశాన్, కెల్విన్‌లతో కలసి డ్రగ్స్ దందా చేసిన సయ్యద్ యూనిస్, తౌబీర్ అహ్మద్ అనే ఇద్దరిని కూడా సిట్ శుక్రవారం విచారించింది. ఆ ఇద్దరు చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్నారని.. కెల్విన్ ద్వారా వారు డ్రగ్స్ తెప్పించుకున్నట్టు ఆధారాలు లభించడంతో విచారిస్తున్నామని సిట్ అధికారులు తెలిపారు.
నేడు విచారణకు రవితేజ డ్రైవర్
డ్రగ్స్ కేసులో శుక్రవారం రవితేజతో సహా పలువురిని విచారించిన సిట్.. శనివారం రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును ప్రశ్నించనుంది. జీశాన్‌తో శ్రీనివాసరావు పదే పదే ఫోన్‌లో సంభాషించినట్టు కాల్‌డేటా ఆధారంగా అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు ఎందుకు అన్ని సార్లు మాట్లాడాడు, అతడి ద్వారా రవితేజ డ్రగ్స్ తెప్పించుకున్నాడా.. తదితర అంశాలపై విచారించనున్నారు.