పేదల భూముల్లో పెద్దల పాగా
ప్రభుత్వ నిరుపేదలకు పంపిణీ చేసిన భూములు పెద్దల వశమవుతున్నాయి. పేదలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే బృహత్తర ఆశయం గాడి తప్పుతోంది. పేదల అవసరాన్ని ఆసరగా చేసుకుని చౌకగా సర్కారు భూముల్ని కొట్టేస్తున్నారు. సిరిసిల్ల శివారులో రూ.15కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పరాధీనమయ్యాయి. పేదలు పేదలుగానే ఉండిపోగా పెద్దలు మాత్రం ప్రభుత్వ భూములను దక్కించుకొని దర్జాగా వ్యవసాయం చేస్తున్నారు.
సిరిసిల్ల : మండలంలోని పెద్దూరులో పధ్నాలుగేళ్ల క్రితం 700ఎకరాల ప్రభుత్వ భూములను 180మంది పేదలకు పంచారు. సర్వే నంబరు 405లో 400 ఎకరాలు, సర్వేనంబరు 408లో 300ఎకరాలను పంపిణీ చేసి పట్టాలు ఇచ్చా రు. భూములు పొందిన వారిలో పెద్దూరుకు చెందిన దళితులు, సిరిసిల్ల పట్టణానికి చెంది నవారు కొందరున్నారు. చిన్నబోనాల శివారులోని సర్వే నంబరు 164లో 210 ఎకరాల అసైన్డ్ భూముల్ని భూమి లేని పేదలకు అందించారు. అంకుసాపూర్‌లో సర్వే నంబరు 1129లో రెండెకరాలు పరాధీనమయ్యాయి.
ఈ భూములన్నీ సిరిసిల్ల పట్టణానికి శివారులోనే ఉండడం విశేషం. పేదలు ఈ భూముల తో ఆర్థికంగా స్థిరపడాలనే సర్కారు లక్ష్యం గాడితప్పింది. సాగుకు యోగ్యంగా లేని భూముల్ని ప్రభుత్వం ఇవ్వడంతో పేదలు ఆ భూముల్ని సాగుచేసుకునే ఆర్థిక స్థోమత లేక వదిలేశారు. ఇదే అదనుగా కొందరు ఆర్థికం గా ఉన్నవారు రూ.5000 నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తూ... పేదల ఆర్థిక అవసరాన్ని ఆసరగా చేసుకునే ఆ భూముల్ని చౌకగా కొనుగోలు చేశారు.
పెద్దూరు పెద్దచెరువు పైభాగం లో లచ్చయ్య అనే వ్యక్తి తన పేరిట, భార్య పేరిట, తమ్ముడి పేరిట, బావ పేరిట, చెల్లెలు పేరిట ఇలా 30 ఎకరాలు కొనుగోలు చేశారు. బోర్లు వేసి సాగు చేస్తున్నారు. ఇలా పేదల భూములను పెద్దలు కబ్జా చేశారు. చిన్నబోనాలలో కోలపురం ఎల్లయ్య, భూంపేరు నాగ య్య, పూడురి రాజయ్య, దువ్వ అంజయ్య, గుర్రం రామస్వామి, బాలయ్య, రాజయ్యల భూములు పెద్దలకు చేరిపోయాయి. గుట్టల దగ్గర ఉన్న భూమిని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేసి బోర్లువేసి సాగుచేస్తున్నాడు. పట్టణ శివారుల్లో ఈ భూములుండడంతో ఒక్కో ఎకరం విలువ ఇప్పుడు రూ.5 నుంచి రూ.10లక్షల పలుకుతోంది. పరాధీమైన భూముల విలువ ఇప్పుడు రూ.పదిహేనుకోట్ల మేరకు ఉంటుందని అంచనా.
చట్టం వారికి చుట్టమే..
ప్రభుత్వ భూములను కొనడం, అమ్మడం నేరం. కానీ రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమాలన్నీ సక్రమాలైపోతున్నాయి. పట్టాలు పొందిన పేదలే ఆ భూమి మాకు వద్దంటూ రాజీనామా చేస్తూ... కొనుగోలు చేసిన వారికి విరాళంగా అందించినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. కొందరు అధికారులు నిబంధనలు పేర్కొంటూ భూములు కొన్న వారికి నోటీసులిచ్చి కాసులు దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ భూములకు పాస్‌బుక్కులు పొంది, బ్యాంకు రుణాలు పొందినట్లు సమాచారం.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
ఆ భూముల సర్వేనంబర్ల వారీగా విచారణ చేస్తాం. మండలంలోని ప్రభుత్వ భూములను ఈ మధ్య పరిశీలించాను. భూముల వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నాం. పేదలకు ఇచ్చిన పట్టాల వివరాలను పరిశీలించి కబ్జాలో ఎవరున్నారో తెలుసుకుని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. - మన్నె ప్రభాకర్, తహశీల్దార్