మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామానికి చెందిన మాధవరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రావల్‌కోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గూడూరు మాధవరెడ్డి గురువారం రాత్రి మునీరాబాద్ నుంచి వస్తుండగా కడప పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ చూపి, వాహనం దిగాలని సూచించారు. వెంటనే మాధవరెడ్డి స్టీరింగ్ కేసి తలను బాదుకుని, కేకలు వేయటం ప్రారంభించాడు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవటంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మాధవరెడ్డి.. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారంటూ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని శుక్రవారం ఉదయం కడప జిల్లా పోలీసులు తెలపటంతో మేడ్చల్ పోలీసులు బిత్తరపోయారు. మాధవరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడని తెలియగానే ఆశ్చర్యపోయారు. వారిచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేశారు.
అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు మాధవరెడ్డి ఇంటిపై దాడి చేసి, నాలుగు ఎర్రచందనం దుంగలు లభించటంతో కేసు నమోదు చేసి, అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాలేవీ తమకు తెలియదని మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి అంటున్నారు.
వివాదాస్పదుడు..రౌడీషీటర్
మాధవరెడ్డి మొదటి నుంచి వివాదాస్పదుడు. పదేళ్ల క్రితమే మేడ్చల్ పోలీసులు ఆయనపై రౌడీషీట్ తెరిచారు. తాండూర్, చేవెళ్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. అతన్ని అరెస్ట్ చేయడానికి రావల్‌కోల్ గ్రామానికి వెళ్లిన చేవెళ్ల పోలీసులపై కుటుంబసభ్యులు రాళ్లతో దాడి చేశారు. చిల్లర కేసుల్లో ఉండే మాధవరెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడని తెలియగానే మండల ప్రజలు విస్తుపోయారు.
ఎర్రచందనం స్మగ్లర్ మాధవరెడ్డి అరెస్ట్
Published Fri, May 15 2015 5:34 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement