జిల్లాల వారీ కోడ్‌లను అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
అధికారులు ప్రతిపాదించిన నంబర్లను ఓకే చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పక్షం రోజుల తర్వాత ఈ సిరీస్‌ను ప్రకటించడం విశేషం. వాస్తవానికి ఈ నెల 2 (అపాయింటెడ్ డే) తేదీ నుంచే కొత్త సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికి... టీజీ సిరీస్ కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాల్సి రావటం, కొత్త సిరీస్‌తో మరో నోటిఫికేషన్ జారీ జాప్యం కావడం, టీఎస్ సిరీస్ జారీ అయినా జిల్లాల వారిగా కోడ్‌నంబర్ల కేటాయింపు వెంటనే చేయకపోవడంతో ఈ జాప్యం అనివార్యమైంది. దీంతో గత పక్షం రోజులుగా తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. ఎట్టకేలకు జిల్లాల వారి కోడ్ నెంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి పొద్దుపోయాక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కానున్నాయి.
ఏపీ సిరీస్‌లో భాగంగా తెలంగాణ జిల్లాలకు ఉన్న కోడ్‌నంబర్లను టీఎస్ సిరీస్‌లో కూడా కొనసాగించాలని ఇదివరకే రవాణాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఏపీ బదులు టీఎస్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుందని జిల్లా కోడ్‌లు మారిస్తే సాఫ్ట్‌వేర్ పరంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు పేర్కొన్నారు. కాని తెలంగాణ జిల్లాలకు కొత్త కోడ్ ఉండాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించడంతో కొత్త కోడ్ నంబర్లు కేటాయించక తప్పలేదు. పాత కోడ్ నంబర్లలో వీలైనన్ని అలాగే ఉండేలా అధికారులు ఈ కొత్త కోడ్ నంబర్లను కేటాయించడం విశేషం. పాత సిరీస్‌లో హైదరాబాద్ నగరంలో ఉన్న 9,10,11,12,13 కోడ్‌నంబర్లే ఇప్పుడు ఉండడం విశేషం.
కొత్త సిరీస్‌లో భాగంగా తొలి నెంబర్‌గా టీఎస్ 09 ఈఏ 0001 బుధవారం కేటాయించనున్నారు. పోలీసు వాహనాలకు గతంలోలానే పీ కోడ్‌ను, ఆర్టీసీకి జెడ్‌ను, రవాణాశాఖ వాహనాలకు టీ, యూ,వి, డబ్ల్యూ, ఎక్స్, వై వరకు కేటాయించారు.