భౌతిక దూరం పాటిస్తూ రైలు ఎక్కుతున్న ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన సాధారణ ప్రయాణికుల రైళ్లు చాలాకాలం తర్వాత సోమవారం పట్టాలెక్కాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించాయి. 70 రోజులకు పైగా బోసిపోయిన స్టేషన్లలో సందడి నెలకొంది. గత కొద్ది రోజులుగా పలు శివారు స్టేషన్ల నుంచి శ్రామిక్ రైళ్లను నడిపిన విషయం తెలిసిందే. కానీ సోమవారం ఒక్క రోజే 9 రైళ్లు బయల్దేరాయి. సుమారు 13 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. సోమవారం ఉదయం నాంపల్లి నుంచి బయల్దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో 958 మంది ప్రయాణికులు బయల్దేరగా, సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అత్యధికంగా 1,423 మంది ఊళ్లకు వెళ్లారు.
సాధారణ ప్రయాణికులతో పాటు, శ్రామిక్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేని కార్మికులు సైతం ఈ ట్రైన్‌లో వెళ్లారు. సికింద్రాబాద్–ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 1,167 మంది, సికింద్రాబాద్–గుంటూరు మధ్య రాకపోకలు సాగించిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో 2,210 (రెండు వైపులా) మంది ప్రయాణించారు. ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతి వెళ్లిన రాయలసీయ ఎక్స్‌ప్రెస్ మాత్రం 520 మంది ప్రయాణికులతో బయల్దేరింది. అలాగే ముంబైకి వెళ్లిన హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ 587 వరకు వెళ్లారు. తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మిగతా అన్ని రైళ్లు దాదాపు బెర్తుల సామర్థ్యం మేర బయల్దేరాయి.
సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు బారులుదీరిన ప్రయాణికుల
బయల్దేరిన రైళ్లు ఇవే..
హైదరాబాద్–న్యూఢిల్లీ (02723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–ధానాపూర్ (02791) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (రెండు వైపులా)(07201/07202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–హౌరా (02704) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–విశాఖపట్నం (02728) గోదావరి ఎక్స్‌ప్రెస్, తిరుపతి–నిజామాబాద్ (02793) రాయలసీమ ఎక్స్‌ప్రెస్, నాందేడ్–అమృత్‌సర్ (02715) సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–ముంబై (02702) హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయల్దేరాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల భద్రత, కరోనా నిబంధనల అమలు, తదితర అంశాల పట్ల దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేక శ్రద్ధ చూపారు. నాంపల్లి, సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ, తిరుపతి, గుంటూరు, తదితర అన్ని ప్రధాన స్టేషన్లలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
థర్మల్ స్క్రీనింగ్ కోసం భారీ క్యూలు...
రైలు బయల్దేరే సమయానికి 90 నిమిషాలు ముందుగా స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉండగా, చాలామంది అంతకంటే ముందే వచ్చారు. ఉదయం 6 గంటలకు బయల్దేరే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత బయల్దేరే ధానాపూర్, గోల్కొండ, రాయలసీమ తదితర రైళ్ల కోసం ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ క్రమంలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి అనుమతించేందుకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో ప్రయాణికులు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాల్సి వచ్చింది. సికింద్రాబాద్ ఒకటి, 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లకు చేరుకొనేందుకు ప్రయాణికుల క్యూలైన్లు రెతిఫైల్ బస్‌స్టేషన్‌ను దాటిపోయాయి. మాస్కులు ధరించి ట్రైన్ టికెట్‌తో వచ్చిన వారిని మాత్రమే భౌతిక దూరంలో ఉంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల అనంతరం స్టేషన్‌లోకి పంపారు. ఇందుకు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్..
ప్రయాణికుల రాకపోకల కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను ఏర్పాటు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేసి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని నిర్ధారణ అయ్యాకే అనుమతించారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులను తాకకుండా స్క్రీనింగ్ చేసే ఆటోమేటిక్ థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేశారు. అలాగే టికెట్ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ప్రయాణికుడి ఉష్ణోగ్రతలు నమోదు చేశారు. ఇందుకు పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యేలా చర్యలు చేపట్టారు. భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేశారు. రైళ్లలోనూ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్లలోని ఫుడ్ కోర్టుల్లో ప్యాకింగ్ ఆహారాన్ని, వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచినా.. ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడమే మంచిదని అధికారులు ఇప్పటికే సూచించారు. బెడ్‌షీట్లు, దుప్పట్లు కూడా ప్రయాణికులు సొంతంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment