షీ నీడ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘ్‌వేంద్రసింగ్ చౌహాన్ సతీమణి రేఖా చౌహాన్, వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన
హైదరాబాద్: మహిళల కోసం ‘షీ నీడ్’ను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘ్‌వేంద్రసింగ్ చౌహన్ సతీమణి రేఖా చౌహాన్ పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని జెడ్పీహెచ్‌ఎస్ ముందు తొలిసారిగా ఏర్పాటు చేసిన షీ నీడ్ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించేందుకు షీ నీడ్ దోహదపడుతుందని అన్నారు. వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. రుతుక్రమం సమయంలో ఎంతో మంది విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడం లేదన్నారు. సురక్షితమైన శానిటేషన్ ప్యాడ్‌లు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో షీ నీడ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉపయోగించిన ప్యాడ్‌లను చెత్త లో, డ్రైనేజీలో వేయడం సరికాదన్నారు.
ఉపయోగించిన ప్యాడ్లను కాల్చివేసే మెషీన్ షీ నీడ్‌లో ఉందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఆపిల్ హోమ్ సంయుక్తంగా మరికొన్ని షీ నీడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయని వెల్లడించారు. ఆపిల్ హోమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమా ఆర్య మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న సమస్య నుంచే షీ నీడ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. త్వరలో అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్ వద్ద మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి కియోస్క్ మిషన్‌లో ప్రతి రోజు 50 శానిటరీ ప్యాడ్‌లు అంటే నెలకు 1,500 ప్యాడ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తొలి సెంటర్ ఏర్పాటుకు తానే ఖర్చు చేశానని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సంవత్సరంలో 18,000 శానిటరీ ప్యాడ్స్ అందించే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వీటి ఏర్పాటుకు దాతల సహకారం తీసుకుంటామని మెషీన్‌తో పాటు సంవత్సరం మొత్తం శానిటరీ ప్యాడ్స్ అందించే వారికే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
షీ నీడ్‌కు రూ.2.05 లక్షల ఖర్చు
ప్రతి షీ నీడ్ కేంద్రంలో స్వయం ఉపాధి గ్రూప్ మహిళల చేతి ఉత్పత్తులను విక్రయించుకొనే అవకాశం కల్పిస్తామని నీలిమా ఆర్య తెలిపారు. ప్యాడ్స్‌ను తీసుకున్న మహిళలు ఉపయోగించిన ప్యాడ్లను కాల్చివేసి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ప్యాడ్ అవసరమైన వారు ఎలాంటి మొహమాటం లేకుండా శానిటరీ ప్యాడ్ పొందవచ్చని తెలిపారు. షీ నీడ్ ఏర్పాటు కోసం రూ.2.05 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శానిటరీ ప్యాడ్లను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఎంతో సంతృప్తి ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఉపకమిషనర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment