సాక్షిప్రతినిధి, వరంగల్ : గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో సామూహిక డెత్ మిస్టరీలో కొత్త కోణాలు, అనుమానాలు బయటకు వస్తున్నాయి. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్కకూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్‌కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414)
ఢిల్లీలో ఫర్నిచర్ దుకాణంలో పనిచేసినప్పుడు రఫికతో సంజయ్‌కి పరిచయం ఏర్పడిందన్న ప్రచారం బుధవారం నుంచి తెరపైకి వచ్చింది. అక్కడే ఆమెతో సాన్నిహిత్యం పెరగడంతో పిల్లలతో సహా రఫిక వరంగల్‌కు మకాం మార్చిందంటున్నారు. మృతుల్లో ఒకరైన మహ్మద్ మక్సూద్ ఆలం తన కూతురు బుష్రాను సైతం ఢిల్లీలో ఖాతూన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. రఫిక వ్యవహారం ఢిల్లీలో ఉన్నప్పడే తెలియడంతో వరంగల్‌కు వచ్చాక ఆమెను మక్సూద్ పట్టించుకోలేదని సమాచారం. దీంతో స్తంభంపల్లిలో రఫిక హంతకుడు సంజయ్‌మార్ కాపురం పెట్టిందని తెలిసింది. అయితే నిషా ఆలం తన సొంత సోదరి కుమార్తె కావడంతో అప్పుడప్పుడూ వెళ్లి వచ్చేదని, చివరకు రఫికా కనిపించకుండా పోవడాన్ని ఆమె నిలదీయడం వల్లే సంజయ్‌కుమార్ ఈ దురాఘతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.(హత్య.. ఆపై హత్యలు)
సంజయ్‌కుమార్ నేర చరిత్రపై ఆరా..
మక్సూద్ సమీప బంధువు రఫిక అలియాస్ చోటీ కుటుంబంపై కూపీ లాగుతున్న పోలీసులు, నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ నేరచరిత్రపైనా మళ్లీ ఆరా తీస్తున్నారు. 14 రోజుల రిమాండ్ కోసం మంగళవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసింది. నిందితుడి నేరచరిత్రపై రోజుకో రకమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంజయ్‌కుమార్‌ను మరోసారి విచారించేందుకు కస్టడీ పిటిషన్ కింద అదుపులోకి తీసుకునే యోచన కూడా చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా రెండు రోజులుగా రఫిక భర్త ఏమయ్యాడనే కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు ఆయనను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఫికా భర్త బతికే ఉన్నాడని, ఢిల్లీలోనే ఉన్నాడని.. అయితే ఆయన మానసిక ప్రవర్తన బాగాలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో స్పష్టత వస్తేనే అందరి అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది.(గొర్రెకుంట.. ఒక్కడే 9 హత్యలు ఎలా చేశాడు?)
రఫిక పిల్లలను కలిసి మాట్లాడిన బంధువులు
గీసుకొండ(పరకాల) : గొర్రెకుంట ఘటన తర్వాత అనాథలైన రఫిక పిల్లకు గీసుకొండ పోలీసులు రక్షణ కల్పించారు. సిర్దాస్ ఖాతూన్‌ను హన్మకొండ సుబేదారిలోని సఖి సెంటర్‌లో, ఇద్దరు కుమారులను వరంగల్ నగరం ఆటోనగర్ వద్ద గల జువైనెల్ హోంకు తరలించారు. వారిని కలవడానికి పశ్చిమ బెంగాల్ నుంచి రఫిక తల్లికి అన్న(మేనమామ)తో పాటు మరో ముగ్గురు బంధువులు బుధవారం ఇక్కడికి వచ్చారు. పోలీసులను సంప్రదించడంతో మాట్లాడటానికి అనుమతించారు. మాట్లాడిన తర్వాత ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి పోషిస్తామని కోరగా కోర్టు అనుమతి తప్పని సరి అని పేర్కొన్నారు. వారిని పోషించే స్తోమత మీకుందని కోర్టు నమ్మితే అనుమతిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment