
‘గుట్ట’లో రిలయన్స్ ఉచిత వై-ఫై
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి)లో రిలయన్స్ సంస్థ వారు ఉచిత వై-ఫై సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు ఈ సంస్థ మేనేజర్ వంగ మల్లేష్ సోమవారం దేవస్థానాన్ని సందర్శించి ఈవో గీతారెడ్డితో సమావేశమయ్యారు. కేబుల్ కనెక్షన్లను ఎలా ఇవ్వాలి? రూటర్లు, వస్తు సామగ్రి ఎక్కడ భద్ర పరచాలి? తదితర విషయాలపై చర్చించారు.
వైటీడీఏలో భాగంగా వై-ఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం ఈఓ తెలిపారు. ముకేశ్ అంబానీకి గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 15 రోజుల్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. ప్రధాన దేవాలయం మినహాయించి చుట్టుపక్కల ప్రాంతాలలోని 100 మీటర్ల వరకు ఈ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు.