ప్రభాస్‌కు ఊరట | Relief To Prabhas From His Land Case | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌కు ఊరట

Published Wed, Apr 24 2019 2:19 AM | Last Updated on Wed, Apr 24 2019 12:44 PM

Relief To Prabhas From His Land Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో ప్రముఖ నటుడు ప్రభాస్‌కు హైకోర్టు ఊరట లభించింది.  ఆరు దశాబ్దాలుగా సాగుతున్న వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశగా కోర్టు పలు సూచనలు చేసింది. ప్రభాస్‌ స్వాధీనంలో ఉన్న భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. 1958 నుంచి ఇక్కడి భూములపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో తిరిగి ఆ భూమిని ప్రభాస్‌కు స్వాధీనం చేయాలని ఆదేశించలేమంది.

భూ క్రమబద్దీకరణకు అతను దరఖాస్తు పెట్టుకుంటే, విస్తృత ప్రజాప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందుకున్న 8 వారాల్లో ఆ దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. ఏళ్ల నుంచి ఉన్న సుదీర్ఘ భూ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించినట్లవుతుందన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది.

ప్రభాస్‌ దరఖాస్తు విషయంలో జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా ఈ వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కోరుతున్న మిగిలిన వారు కూడా అదే రీతిలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రభాస్‌ పెట్టుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ భూమి అతని స్వాధీనమవుతుందంది. ప్రభుత్వం అతని దరఖా స్తు ను తిరస్కరిస్తే అతను కోర్టును ఆశ్రయించవచ్చంది. భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్‌ సేల్‌ డీడ్ల ద్వారా ఆ భూములపై సంక్రమించిన హక్కులను వదులుకుని, ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే, అప్పుడు ప్రభుత్వం ఆ భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని హైకోర్టు తెలిపింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో తనకున్న భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు ఆ భూమి గేటుకు తాళాలు వేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం, మంగళవారం తీర్పునిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement