ఎన్నాళ్లు ఇలా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరతపై రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని చాలా స్కూళ్లలో టీచర్లు ఉండకపోవడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని పలు ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, దాన్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా రూ.38 కోట్లతో చేపట్టిన 653 అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవడమేమిటనీ ప్రశ్నించారు. మోడల్ స్కూల్ భవనాల నిర్మాణ పనుల జాప్యంపైనా మంత్రి మండిపడ్డారు.
కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని మండలాల్లో తాను పర్యటించినప్పుడు ఉపాధ్యాయుల కొరతను గుర్తించానని, దీన్ని సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, సర్వశిక్షాభియాన్ పీఓ కిషన్‌రావు, వయోజన విద్యాసంచాలకులు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.