తొలగించిన ఓట్లు 3.54 లక్షలు | Removal of the 3.54 lakh votes | Sakshi
Sakshi News home page

తొలగించిన ఓట్లు 3.54 లక్షలు

Published Wed, Oct 28 2015 11:45 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

Removal of the 3.54 lakh votes

అర్హతలేని ఓట్లు గ్రేటర్‌లోనే ఎక్కువ
* 14 నియోజకవర్గాల్లో 11.44 లక్షల మందికి నోటీసులు
* సరైన వివరణ అందడంతో 3.75 లక్షల ఓట్ల పునరుద్ధరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జోరందుకుంది. కొత్తగా ఓట్ల నమోదుతో పాటు డూప్లికేట్లు, అర్హతలేని, మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే పనిలో అధికారులు బిజీ అయ్యారు. తుది జాబితా ప్రకటనకు ఇంకా గడువు ఉన్నప్పటికీ.. నిర్దేశించిన తేదీల ప్రకారం అధికారులు చర్యలు వేగిరం చేశారు.

మరోవైపు గ్రేటర్ ఎన్నికలు తరుముకు వస్తుండడంతో పక్కా జాబితాతో ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తాజాగా చేపట్టిన సవరణ ప్రక్రియలో అర్హతలేని ఓట్ల సంఖ్య భారీగా బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో 52,93,113 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఏకంగా 11,44,380 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఇవన్నీ అర్హతలేని ఓట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించి ఈ మేరకు తాకీదులిచ్చారు.
 
పట్టణ ప్రాంతాల్లోనే..
అధికారుల గణాంకాల ప్రకారం అర్హతలేని ఓట్లు ఎక్కువగా పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏకంగా 2.21 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా కూకట్‌పల్లిలో 2.01 లక్షలు, కుత్బుల్లాపూర్‌లో 1.34 లక్షలు, మల్కాజిగిరిలో 1.17 లక్షలు, ఎల్‌బీ నగర్‌లో 1.11 లక్షల మందికి నోటీసులిచ్చారు. వీరిలో చాలామంది నుంచి వివరణ తీసుకున్న తర్వాత నిబంధనల మేరకు వాటిలో అర్హతలేని ఓట్లను తొలగించారు.

ఇలా జిల్లా వ్యాప్తంగా 3,54,428 మందిని జాబితా నుంచి శాశ్వతంగా తొలగించారు. వీటిలో అధికంగా కూకట్‌పల్లిలో 1.08 లక్షల ఓట్లు తీసేశారు. అదేవిధంగా శేరిలింగంపల్లిలో 60,583 ఓట్లు, కుత్బుల్లాపూర్‌లో 33,929 ఓట్లు, ఉప్పల్‌లో 28,471 ఓట్లు తొలగించారు. నోటీసులు జారీ చేసిన తర్వాత సరైన వివరణ అందడంతో 3,75,371 మంది ఓట్లను తిరిగి జాబితాలో పునరుద్ధరించారు.
 
కేంద్రం నుంచి ఆడిట్ బృందం..
జిల్లాలో లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించడంపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలు పార్టీలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించడాన్ని పార్టీలు తప్పు బడుతున్నాయి.

ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఎన్నికల సంఘాన్ని కలిశాయి. దీంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆడిట్ బృందాన్ని జిల్లాకు పంపనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్ నియోజకవర్గాలు, హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా సవరణ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించనుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement