Voter List Editing process
-
ఓటు దొంగలున్నారు.. జాగ్రత్త!
జిల్లాలోని పలు నియోజకవర్గంలో గెలుపోటములను తారుమారు చేసే ఓటర్లు సంఖ్య మూడు వేల నుంచి నాలుగువేలు మాత్రమే. ఇది గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు 2014లో టీడీపీ అభ్యర్థి కె.రామకృష్ణ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమ్మి లక్షయ్యనాయుడుపై 5,635 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మూడు వేలు నుంచి నాలుగు వేలు ఓట్లు అటు పడాల్సినవి ఇటు పడితే ఫలితాలు తారుమారే. ఈ క్రమంలో ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా ఓట్లు తొలగింపుల కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వస్తున్న దరఖాస్తులు చూస్తుంటే ఎన్నికల్లో లబ్ధికోసం ఓ వర్గం చేస్తున్న పాలి ట్రిక్స్‌గా న్యూట్రల్ ఓటర్లు అభిప్రాయ పడుతున్నారు. సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి నియోజకవర్గంలో ఫామ్–7 దరఖాస్తులు (ఓట్లు తొలగింపులకు సంబంధించిన ఫామ్స్) రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులైన ఓటర్లే లక్ష్యంగా వేల సంఖ్యల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నమోదవుతున్నాయిని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లాకే పరిమితం అయిన ఈ జాఢ్యం ఆ జిల్లా సరిహద్దు నియోజకవర్గం అయిన వెంకటగిరికీ పాకింది. ఎవరు చేస్తున్నారో.. ఎక్కడ నుంచి చేస్తున్నారో .. ఎందుకు చేస్తున్నారో.. ఇలా గంపగుత్తుగా వస్తున్న «ఓట్ల తొలగింపు దరఖాస్తులపై అధికారులు పక్కగా విచారణ చేపట్టి ఓట్లు దొంగల అక్రమాలకు చరమగీతం పాడాలని ప్రతిపక్షపార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దరఖాస్తులు వచ్చినంతమాత్రాన ఓట్లు తొలగించే ప్రసక్తే లేదని, క్షేత్రస్థాయిలో నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టిన తరువాత సరైన కారణాలతోనే ఓట్లు తొలగింపులు చేస్తామని అధికారులు చెబుతున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎంత వరకు సాధ్యమని, అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు వేలసంఖ్యలో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయడం సాధ్యమయ్యే పనికాదంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. 2,200 క్లెయిములతో విస్తుపోయిన అధికారులు కలవాయి మండలంలో ఓటు తొలగింపులకు సంబంధించి మొత్తం 2,200 క్లెయిములు అందడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ దరఖాస్తులన్నీ రాత్రికి రాత్రే ఒక్క రోజే రావడంతో నియోజకవర్గ ఎన్నికల అధికారి మురళి మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పక్కాగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. కలువాయి మండలంలోని 43 పోలింగ్ స్టేషన్లు ఉండగా 26 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 26 మంది పేరున 2,263 ఫామ్–7 క్లెయిములు ఆన్లైన్లో నమోదయ్యాయి. ఈ క్లెయిములన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ మాజీ కన్వీనర్లు, ప్రస్తుత కన్వీనర్ల పేరున దరఖాస్తులు అందాయి. వీటిలో మెజారిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు కావడం గమనార్హం. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు సామల మోహన్‌రెడ్డి. కలువాయి మండలం బాలాజీ రావుపేటకు చెందిన వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్. చిత్రమేమిటంటే మోహన్‌రెడ్డి తన ఓటును తొలగించాలని ఆన్లైన్ ద్వారా ఫామ్–7 దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు విచారణకు రావడంతో అవాక్కయ్యాడు. ఇంకా మోహన్‌రెడ్డి గ్రామానికి చెందిన మరో 30 మంది ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో ఫామ్–7 దరఖాస్తు చేసినట్లు నమోదైందని అధికారులు మోహన్‌రెడ్డికి వివరించడంతో విస్తుపోయాడు. తనకు తెలియకుండా అలా ఎవరు చేశారో అర్థం కావడం లేద ని అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దోషులను గుర్తించి శిక్షించాలని కోరుతున్నాడు. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చల్లా రమణారెడ్డి. కలువాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పేరుతో 169 ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో ఫామ్–7 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఆ క్లెయిమ్‌లలో మోహన్‌రెడ్డి భార్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీకి చెందిన వారి పేర్లు ఉన్నాయి. మోహన్‌రెడ్డికి తెలియకుండా ఆయన పేరుతో ఆన్లైన్లో క్లెయిములు పెట్టిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు దరఖాస్తులను పక్కాగా పరిశీలించాలి వెంకటగిరి నియోజకవర్గంలో వేలాదిగా వచ్చిన ఫామ్–7 దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ జరిపించాలి. ప్రతి దరఖాస్తుకు సంబంధించి ఇంటింటికీ వెళ్లి విచారణ చేపట్టాలి. ఓట్లు తొలగింపులపై ఓటర్లలో ఉన్న ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత అధికారులదే. – జి.ఢిల్లీబాబు, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్, వెంకటగిరి ఆన్లైన్లో వచ్చిన ఫారమ్–7 దరఖాస్తులు వెంకటగిరి 344 కలువాయి 2200 రాపూరు 145 సైదాపురం 683 బాలాయపల్లి 229 డక్కిలి 300 మొత్తం 3901 -
తప్పుల సవరణకు తీసుకుంటున్న చర్యలేంటి?
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో తప్పులు సరిదిద్దేందుకు.. అందుకు అనుగుణంగా ఓటర్ల జాబితా తయారు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో సోమవారం నాటికి రాతపూర్వకంగా తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ని ఆదేశించింది. ఈ వివరాలను పరిశీలించి తాము నిర్ణయం వెలువరించేంత వరకు ఓటర్ల జాబితాను ప్రచురించవద్దని స్పష్టంచేస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజు దీనినే మొదటి కేసుగా విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో భారీస్థాయిలో తప్పులున్నాయని, పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని, ఈ తప్పులను సరిదిద్దేంత వరకు తుది ఓటర్ల జాబితా ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది ఓటర్ల విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని నివేదించారు. తెలంగాణలోని ఓటర్ల జాబితాలో 30 లక్షల డూప్లికేట్ ఓటర్ల పేర్లున్నాయని, ఇదే సమయంలో 20 లక్షల మంది ఓటర్ల పేర్లను అనుమానాస్పద రీతిలో తొలగించారని తెలిపారు. ఈ తప్పులను సరిదిద్దకుండానే ఈ నెల 8న తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 8న ప్రచురించాలనుకున్నది తుది జాబితా కాదు... కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. 8వ తేదీన తాము ప్రచురించేది తుది ఓటర్ల జాబితా కాదని తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. 8న తాము ప్రచురించాలనుకున్న ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేయవచ్చని, ఆ అభ్యంతరాలపై విచారణ జరిపి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల జాబితాలో పిటిషనర్ లేవనెత్తిన తప్పులన్నీ కూడా గతంలో ఉన్నవేనని, తాము సవరణ జాబితాను సిద్ధం చేయడానికి ముందే ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీఈసీ వాదన పట్ల సంతృప్తి చెందుతున్నట్లు తెలిపింది. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ.. అందుకు అనుగుణంగా జాబితా తయారీకి తీసుకుంటున్న చర్యలేమిటో తమ ముందుంచాలని ఈసీని ఆదేశించింది. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఓటర్ల జాబితా సవరణ గడువును కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ఈ దశలో ఎన్నికల సంఘం నిర్ణయంపై జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. రాజ్యాంగ నిబంధనలకు లోబడి గరిష్టంగా 6 నెలల్లోపు ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొంది. రాజ్యాంగ నిబంధనలను, సుప్రీం కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకున్నాకే ఓటర్ల జాబితా సవరణ గడువును ఎన్నికల సంఘం కుదించిందని తెలిపింది. తెలంగాణ విషయంలోనే ఈ నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికలు జరగాల్సి ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో కూడా ఇలాగే నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కుదించకపోతే సమస్యలొస్తాయి.. ఓటర్ల జాబితా సవరణకు మొదట 2019 జనవరి 1వ తేదీని గడువుగా నిర్ణయించారని, ఆ తర్వాత దాన్ని ముందస్తు ఎన్నికలను కారణంగా చూపుతూ ఈ ఏడాది జనవరి 1 నాటికి కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నోటిఫికేషన్ జారీ చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయవాది కొమిరెడ్డి కృష్ణ విజయ్ ఆజాద్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్ వల్ల దాదాపు 25 లక్షల మంది ఓటర్ల జాబితాలో చేరే అవకాశం కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికే సవరించిన ఓటర్ల జాబితాలో 60 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ గడువును కుదించకపోతే తుది జాబితా రూపకల్పనలో ఎన్నికల సంఘానికి అనేక సమస్యలొస్తాయని పేర్కొంది. ఇదే జరిగితే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని, తద్వారా అనేక రాజ్యాంగపరమైన సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. కాబట్టి వాస్తవిక కోణంతో ఆలోచిస్తే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఓటర్ల జాబితా సవరణ గడువును కుదించినట్లు స్పష్టమవుతోందని వివరించింది. ‘ఈ నోటిఫికేషన్లో ఎటువంటి వైరుధ్యాలు కనిపించట్లేదు. ఈ నోటిఫికేషన్ వల్ల ఎన్నికలు ప్రశాంత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలు చూపట్లేదు. రాజ్యాంగం ప్రకా రం నిర్వర్తించాల్సిన బాధ్యతల మేరకే ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ప్రస్తుత దశలో ఈ నోటిఫికేషన్ విషయంలో ఏ రకంగా జోక్యం చేసుకోలేం’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది. పిటిషన్‌ను కొట్టేసేందుకు ధర్మాసనం సిద్ధమవుతున్న సమయంలో తమ పిటిషన్ ఉపసంహరణకు పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
తొలగించిన ఓట్లు 3.54 లక్షలు
అర్హతలేని ఓట్లు గ్రేటర్‌లోనే ఎక్కువ * 14 నియోజకవర్గాల్లో 11.44 లక్షల మందికి నోటీసులు * సరైన వివరణ అందడంతో 3.75 లక్షల ఓట్ల పునరుద్ధరణ సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జోరందుకుంది. కొత్తగా ఓట్ల నమోదుతో పాటు డూప్లికేట్లు, అర్హతలేని, మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే పనిలో అధికారులు బిజీ అయ్యారు. తుది జాబితా ప్రకటనకు ఇంకా గడువు ఉన్నప్పటికీ.. నిర్దేశించిన తేదీల ప్రకారం అధికారులు చర్యలు వేగిరం చేశారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికలు తరుముకు వస్తుండడంతో పక్కా జాబితాతో ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తాజాగా చేపట్టిన సవరణ ప్రక్రియలో అర్హతలేని ఓట్ల సంఖ్య భారీగా బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో 52,93,113 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఏకంగా 11,44,380 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఇవన్నీ అర్హతలేని ఓట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించి ఈ మేరకు తాకీదులిచ్చారు. పట్టణ ప్రాంతాల్లోనే.. అధికారుల గణాంకాల ప్రకారం అర్హతలేని ఓట్లు ఎక్కువగా పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏకంగా 2.21 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా కూకట్‌పల్లిలో 2.01 లక్షలు, కుత్బుల్లాపూర్‌లో 1.34 లక్షలు, మల్కాజిగిరిలో 1.17 లక్షలు, ఎల్బీ నగర్లో 1.11 లక్షల మందికి నోటీసులిచ్చారు. వీరిలో చాలామంది నుంచి వివరణ తీసుకున్న తర్వాత నిబంధనల మేరకు వాటిలో అర్హతలేని ఓట్లను తొలగించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 3,54,428 మందిని జాబితా నుంచి శాశ్వతంగా తొలగించారు. వీటిలో అధికంగా కూకట్‌పల్లిలో 1.08 లక్షల ఓట్లు తీసేశారు. అదేవిధంగా శేరిలింగంపల్లిలో 60,583 ఓట్లు, కుత్బుల్లాపూర్‌లో 33,929 ఓట్లు, ఉప్పల్‌లో 28,471 ఓట్లు తొలగించారు. నోటీసులు జారీ చేసిన తర్వాత సరైన వివరణ అందడంతో 3,75,371 మంది ఓట్లను తిరిగి జాబితాలో పునరుద్ధరించారు. కేంద్రం నుంచి ఆడిట్ బృందం.. జిల్లాలో లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించడంపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలు పార్టీలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించడాన్ని పార్టీలు తప్పు బడుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఎన్నికల సంఘాన్ని కలిశాయి. దీంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆడిట్ బృందాన్ని జిల్లాకు పంపనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్ నియోజకవర్గాలు, హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా సవరణ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించనుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.