సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో తప్పులు సరిదిద్దేందుకు.. అందుకు అనుగుణంగా ఓటర్ల జాబితా తయారు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో సోమవారం నాటికి రాతపూర్వకంగా తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ని ఆదేశించింది. ఈ వివరాలను పరిశీలించి తాము నిర్ణయం వెలువరించేంత వరకు ఓటర్ల జాబితాను ప్రచురించవద్దని స్పష్టంచేస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజు దీనినే మొదటి కేసుగా విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓటర్ల జాబితాలో భారీస్థాయిలో తప్పులున్నాయని, పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని, ఈ తప్పులను సరిదిద్దేంత వరకు తుది ఓటర్ల జాబితా ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది ఓటర్ల విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని నివేదించారు. తెలంగాణలోని ఓటర్ల జాబితాలో 30 లక్షల డూప్లికేట్ ఓటర్ల పేర్లున్నాయని, ఇదే సమయంలో 20 లక్షల మంది ఓటర్ల పేర్లను అనుమానాస్పద రీతిలో తొలగించారని తెలిపారు. ఈ తప్పులను సరిదిద్దకుండానే ఈ నెల 8న తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
8న ప్రచురించాలనుకున్నది తుది జాబితా కాదు...
కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. 8వ తేదీన తాము ప్రచురించేది తుది ఓటర్ల జాబితా కాదని తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. 8న తాము ప్రచురించాలనుకున్న ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేయవచ్చని, ఆ అభ్యంతరాలపై విచారణ జరిపి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఓటర్ల జాబితాలో పిటిషనర్ లేవనెత్తిన తప్పులన్నీ కూడా గతంలో ఉన్నవేనని, తాము సవరణ జాబితాను సిద్ధం చేయడానికి ముందే ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీఈసీ వాదన పట్ల సంతృప్తి చెందుతున్నట్లు తెలిపింది. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ.. అందుకు అనుగుణంగా జాబితా తయారీకి తీసుకుంటున్న చర్యలేమిటో తమ ముందుంచాలని ఈసీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment