సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు శ్రమిస్తామని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఉద్ఘాటించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని శనివారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పతాకావిష్కరణ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశం ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో శరవేగంగా ముందుకు సాగుతూ.. అగ్రగామిగా నిలిచిందన్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జిల్లా పురోగతిపై ఆయన మాటల్లోనే..
రైతుల ఆర్థికాభివృద్ధికై..
వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి రైతులకు వివరించి.. వారి ఆర్థికాభివృద్ధి కోసం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఖరీఫ్ లో రూ.1,170కోట్ల పంట రుణాలు అందించాం. రబీ సీజన్‌లో రూ.541.51కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించాం. రబీ విత్తన ప్రణాళిక కింద జిల్లాలో 4,286 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశాం. ఆత్మ ద్వారా 2018–19లో 72 క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించి.. వివిధ రైతు సంక్షేమ కార్య క్రమాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాం. భూరికార్డుల సమీకరణలో భాగంగా జిల్లాలో మొత్తం 9.57 లక్షల ఎకరాల భూముల రికార్డులను సమీకరించాం.
380 రెవెన్యూ గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా చేపట్టాం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా రెండు విడతల్లో 2,71,574 పుస్తకాలను రైతులకు అందించాం. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 2,45,848 ఖాతాలను ఆన్‌లైన్ చేయడంతోపాటు 1,84,805 మంది రైతులకు రూ.185.48కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. వాటిలో నాబార్డు సౌజన్యంతో రూ.36కోట్లతో 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 12 గోదాముల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ముగింపు దశలో మిషన్ భగీరథ
మిషన్ భగీరథ పనులు ముగింపు దశలో ఉన్నాయి. పాలేరు, వైరా సెగ్మెంట్ల ద్వారా రూ.1,308కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టాం. ఇక మిషన్ కాకతీయ మొదటి మూడు దశల్లో రూ.309.52కోట్లతో 1,437 చెరువులను పునరుద్ధరించాం. నాలుగో దశ కింద రూ.29.27కోట్లతో మరో 120 పనులను చేపట్టి.. ఇప్ప టికే 72 పనులను పూర్తి చేశాం.సాగర్ ఆధు నికీకరణకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో రూ.572.22కోట్లతో పనులు చేపట్టాం. అలాగే జిల్లాలో రోడ్ల విస్తరణ, నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. రూ.43కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లను రెండు వరుసలుగా విస్తరించాం. రెండు వరుసల రోడ్ల ను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.165కోట్లతో 11 పనులు చేపట్టాం. ఖమ్మం–సూర్యాపేట, ఖమ్మం–కోదాడ, ఖమ్మం–దేవరపల్లి, ఖమ్మం–వరంగల్, ఖమ్మం–విజయవాడ రోడ్లను జాతీయ రహదారులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ను అందిస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం 1,12,303 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులను ఉచితంగా పంపిణీ చేశాం.
నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు..
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భాగంగా జిల్లాకు 14,560 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 9,019 నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చాం. 5,527 ఇళ్ల నిర్మాణాలు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. 2,158 గృహాలు పూర్తి చేసుకుని.. 620 ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి ద్వారా జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. మరింత మెరుగైన విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో ఇప్పటివరకు రూ.1,304కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. అంతేకాక 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.21కోట్లతో మరో 14 సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సబ్సిడీ పథకం కింద ఐదేళ్లలో రూ.255.5కోట్ల సబ్సిడీ అందించాం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్యం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. జిల్లా ప్రధా న ఆస్పత్రిలో 150 పడకలతో ప్రారంభించిన మాతా, శిశు సంరక్షణ కేంద్రం ద్వారా మాతా, శిశు సేవలు అందిస్తున్నాం. 10 పడకలతో ఐసీయూ, 12 పడకలతో డయాలసిస్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షే మానికి జిల్లాలో వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నాం. జిల్లాలోని 39 ఎస్సీ వసతి గృహాల్లో 4,107 మంది, 23 బీసీ వసతి గృహాల్లో 2,546 మంది, ఏడు మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 1,840 మంది, 11 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 6,980 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాం.
పేదింటి ఆడపిల్ల పెళ్లి కుటుంబానికి భారం కాకూడదనే సంకల్పంతో అమలవుతున్న షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 11,944 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ లబ్ధిదారులకు రూ.83,7,36,000 అందించాం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పలు కార్య క్రమాలను అమలు చేస్తున్నాం. ఉపాధిహామీ పథకం కింద 201819 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.96.06కోట్లతో 53.36 లక్షల పని దినాలను కల్పించాం. 3 లక్షల జన్‌ధన్ ఖాతాల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నాం. ప్రధానమంత్రి సురక్షా యోజన పథకం కింద 52,396 కుటుంబాలకు బీమా చేయిం చడంతోపాటు మరణించిన 168 మంది కూలీల కుటుంబాలకు రూ.3.36కోట్లు అందించాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక పద్ధతుల ద్వారా జిల్లాలో 4,04,697 వివిధ కార్డుదారులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. జిల్లాలో పరిశ్రమలను వేగవంతంగా విస్తరించేందుకు ఔత్సాహికులను ప్రోత్సహించడంలో భాగంగా టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నాం.
లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ..
గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో 15,099 మంది లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై రూ.133.32కోట్లతో యూనిట్లను పంపిణీ చేశాం. పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో రూ.3.32కోట్లతో 416 పాడిగేదెలను పంపిణీ చేశాం. హరితహారంలో భాగంగా మూడేళ్లలో 10.02 కోట్ల మొక్కలు నాటాం. 2019లో 395.60 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో మొక్కలను పెంచుతున్నాం. రూ.4కోట్లతో లకారం చెరువు సుందరీకరణ, రూ.13.73కోట్లతో డివైడర్ల నిర్మాణం, రూ.2.50 కోట్లతో పారిశుద్ధ్య పనుల కోసం వాహనాలు కొనుగోలు చేశాం. వయోవృద్ధుల సౌకర్యార్థం నగరంలోని గాంధీపార్కులో రూ.40లక్షలతో డేకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. వీటితోపాటు అనేక సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జేసీ ఆయేషా మస్రత్ ఖానం, ఇన్‌చార్జి జెడ్పీ సీఈఓ హన్మంతు కొడింబా, సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు పోలీస్ కమిషనర్ మురళీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment