సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించే క్రమంలో జెండా మొరాయిం చింది. రోప్‌వైర్‌ను ఎంతసేపు లాగినప్పటికీ జెండా ముడి విచ్చుకోలేదు. జెండా పూర్తిగా ఎగరకుండానే జాతీయ గీతం వాయిద్యాన్ని పోలీస్‌బ్యాండ్ బృందం మోగించడంతో అంద రూ జాతీయ గీతాలాపన కొనసాగించారు.
జాతీయ గీతాలాపన అనంతరం అక్కడే ఉన్న పోలీస్ అధికారులు జెండాను పూర్తిగా కిందకు దించి సరిచేసి, మళ్లీ ఎగురవేశారు. గవర్నర్ హోదాలో తొలిసారి జాతీయ జెండా ఎగరవేసిన తమిళిసై ఈ అపశుత్రితో తీవ్ర అసహనానికి లోనైనట్లు కనిపించారు. తన ప్రసంగం ముగిసిన వెంటనే దీనిపై ఆమె ప్రోటోకాల్ జాయిం ట్ సెక్రటరీ అర్విందర్ సింగ్‌ను పిలిచి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ సైతం ప్రోటోకాల్ అధికారులపై ఆగ్రహాన్ని వెలిబుచ్చినట్లుగా తెలుస్తోంది.
పరేడ్‌లో పాల్గొన్న ఏపీఎస్పీ..
గణతంత్ర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీఎస్పీ పోలీసులతోపాటు సిక్ రెజిమెంట్‌కు చెందిన 5వ బెటా లియన్, టీఎస్‌ఎస్సీకి చెందిన 3వ బెటాలియన్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎన్‌సీసీ విద్యార్థులు పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో పాల్గొన్న ఏపీఎస్పీకి గవర్నర్ ప్రత్యేక ట్రోఫీని అందజేశారు. పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతం చాలా చిన్నదిగా ఉండటంతో ప్రభుత్వ శకటాల ప్రదర్శన జరగలేదు.
తరలివచ్చిన ముఖ్య నేతలు..
గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోతు కవిత, లింగయ్య యాదవ్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల చైర్మన్లు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అపశ్రుతులు.. అవమానాలు
►వికారాబాద్ జిల్లా ధారూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం కిరణ్మయి జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. అప్పటికే జాతీయ గీతాలాపన ప్రారంభమైంది. వెంటనే పొరపాటును సరిదిద్దారు.
►రంగారెడ్డి జిల్లా నేదునూరు పరిధిలోని ఓ విద్యాసంస్థలో మత చిహ్నం ఉన్న రాడ్‌కు జాతీయ జెండాను ఆవిష్కరించడం కలకలం రేపింది. సర్పంచ్ తదితరులు దీనిపై ఆందోళనకు దిగారు. దీనిపై తమకందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ జంగయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment