రెండు రోజుల్లో ప్రసారాలను పునరుద్ధరించండి
తెలంగాణ ఎంఎస్‌వోలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రసారాలు నిలిపివేసిన రెండు తెలుగు టీవీ చానళ్లను సోమవారంలోగా పునరుద్ధరించాలని, లేదంటే లెసైన్స్‌లు రద్దు చేస్తామని ఎంఎస్‌వోలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించారు. పలు రాష్ట్రాల ఎంఎస్‌వోల నాయకులతో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని శాస్త్రిభవన్‌లో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఎంఎస్‌వోలకు పై విధంగా హెచ్చరిక జారీ చేశారు. అంతకు ముందు.. తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాల నిలిపివేతకు సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని జవదేకర్ రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వమే నిషేధం విధించిందనుకుని తాము నోటీసులు ఇచ్చామని, అయితే నిలిపివేసింది ఎంఎస్‌వోలని తెలంగాణ ప్రభుత్వం సమాధానమిచ్చిందని తెలిపారు. టీవీ ప్రసారాల నిలిపివేతపై స్వల్పకాలిక చర్చకు శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ అనుమతిచ్చారు.
టీడీపీ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. అనంతరం మాట్లాడిన టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు.. టీవీ ప్రసారాలకు సంబంధించిన సీడీలను చూపుతూ ఎవరైనా ఆ ప్రసారాలు చూసి మాట్లాడాలని, అందులో వాడిన భాష నీచంగా ఉందని చెప్పారు. ఇదే పత్రికా స్వేచ్ఛ అని ఎవరైనా అంటే.. ‘‘నేనిక్కడే ఉరి తీసుకుంటా’’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. చివరగా కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. చానళ్లు నిలిపివేయడం సరికాదని, ఎంఎస్‌వోలతో సమావేశమవుతానని చెప్పారు.