కంటోన్మెంట్: లడక్‌లో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో20 మంది భారత సైనికులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగాఉద్వేగానికి లోను చేసింది. ఈ ఘటనలో చైనా సైనికులు సైతంచనిపోయినట్లు చెబుతున్నప్పటికీ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. మొత్తానికి ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదా అనే స్థాయిలో చర్చనీయాంశమైన గాల్వన్ ఉదంతం గురించి పెద్దగా ఆందోళనచెందాల్సిన అవసరం లేదని పలువురు రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత 45 ఏళ్లలో భారత్ – చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో సైనికులు మరణించడం ఇదే తొలిసారి కావడం దురదృష్టకరం అని అంటున్నారు. ఇరుదేశాల నడుమఅంతర్జాతీయ సరిహద్దు వివాదం 60 ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, యుద్ధ వాతావరణం ఏర్పడిన సందర్భాలు చాలా అరుదేననిఅంటున్నారు. అయితే అక్కడ చైనా సైన్యంతో పోరాటం కంటే కూడా ప్రకృతితో పోరాటమే కీలకమని గాల్వన్‌లో పనిచేసినఅధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. పేరువెల్లడించడం ఇష్టపడని రిటైర్డ్ ఆర్మీ అధికారుల అభిప్రాయాలు...
ఎప్పటి నుంచో వివాదాస్పద ప్రాంతం
గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్– చైనా నడుమ సరిహద్దు నిర్ధారణ కాలేదు. ఇరు దేశాలు తమ ప్రాంతంగా పేర్కొనే వివాదాస్పద ప్రాంతానికి ఇరువైపులా ఆయా దేశాల సైనిక పోస్టులు ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ప్రదేశం కావడంతో ఇక్కడ వాతావరణ పరిస్థితులు జనజీవనానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. మంచు ఎడారిగా పేర్కొనే ఇలాంటి ప్రదేశాల్లో పనిచేసే సైనికులకు ముందస్తుగా ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తారు. కనీసం 15 రోజుల పాటు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా శరీరాన్ని సంసిద్ధం చేస్తారు. ఆ తర్వాతే అక్కడ పోస్టింగ్‌కు పంపుతారు. అయినా ఎత్తయిన కొండలు, లోయలు, మంచు జలపాతాలతో కూడుకున్న ప్రాంతాల్లో గస్తీ చేయడం అత్యంత సాహసోపేతంగా ఉంటుంది. మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని ఈ ప్రాంతంలో ఎక్కువగా కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా లోయలో పడిపోయే ప్రమాదముంటుంది. ఈ పరిస్థితుల్లో వివాస్పద స్థలంలో తరచూ తారసపడే చైనా సైనికులతో తోపులాటలు, ఘర్షణలు సహజమే. అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సందర్భాలు చాలా అరుదు. – గాల్వన్‌లో పనిచేసిన ఓ రిటైర్డ్ బ్రిగేడియర్
మౌలిక సదుపాయాలు లేవు
గాల్వన్ లోయ ప్రాంతంలో భారత సైనిక పోస్టుల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కొన్నిచోట్ల కేవలం హెలీకాప్టర్ ద్వారా మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది. చైనా వైపు ఎత్తయిన ప్రదేశం ఉండగా, భారత్ వైపు లోయ ప్రాంతం ఎక్కువగా ఉంది. ఇటీవల భారత్ ఆధీనంలోని పోస్టులను చేరేందుకు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేపట్టారు. అదే సమయంలో చైనా ఆధీనంలోని ప్రాంతంలోనూ వివిధ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే భారత్ చేపడుతున్న పనులపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా భారత్‌ను ఇరుకున పెట్టేలా ప్రయత్నిస్తోంది. ఇదే తాజా ఉద్రిక్తతలకు కారణమని తెలుస్తోంది. – 1967–68లో లడక్‌లో పనిచేసిన ఓ ఆర్మీ ఉన్నతాధికారి
చైనాకు ధీటుగానే ఉన్నాం
1962తో పోలిస్తే భారత ఆర్మీ మరింత పటిష్టంగా ఉంది. చైనాకు ధీటుగా సమాధానం చెప్పే స్థాయిలోనే ఉన్నాం. సుమారు 800కు పైగా సైనికులకు కమాండర్‌గా కల్నల్ స్థాయి అధికారి కమాండింగ్ ఆఫీసర్‌గా ఉంటారు. మంగళవారం జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు బృందంలో 12 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 20 మంది భారత సైనికులు మరణించగా, చైనీయులు సైతం 40మందికి పైగా మరణించి ఉండొచ్చు. ఈ మేరకు చైనా అధికారికంగా ధ్రువీకరించకపోయినా ఆ దేశ సైనికులు సైతం మరణించి ఉంటారు. తాజా పరిణామాలు యుద్ధానికి దారితీస్తుందని భావించలేం. భారత సైనిక సామర్థ్యం గురించి బాగా తెలిసిన చైనా అలాంటి దుస్సాహసానికి పాల్పడే అవకాశం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే వచ్చినా భారత్ చైనాకు గట్టి సమాధానమే చెబుతుంది. – రిటైర్డ్ కల్నల్


