గౌతంనగర్: పదవీ విరమణ పొందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు అకుంఠిత దీక్షతో తనకు ఇష్టమైన చిత్రలేఖనం, సంగీత, నాటక రంగాల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్‌లోని మల్లికార్జున నగర్‌కు చెందిన బేతపూడి చంద్రశేఖర్‌రావు లాలాగుడలోని రైల్వే బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసి 2008లో పదవీ విరమణ పొందారు.ఆ తరువాత తనకిష్టమైన రంగాల్లో రాణిస్తూ మన్నన పొందుతున్నారు.
చిత్రకళపై ఆసక్తి......
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పక్కలగడ్డ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రావుకు చిన్నతనం నుంచే చిత్ర కళలపై ఆసక్తి ఎక్కువ. పదవ తరగతి పాసయ్యాక అన్న రాజశేఖర్‌రావు ప్రోత్సాహంతో ప్రముఖ చిత్రకారుడు వేణుగోపాల్ వద్ద మెళుకువలు నేర్చుకున్నారు. 1973–74వ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులవల్ల విజయవాడలోని కమర్షియల్ ఆర్టిస్టిగా చేరి సినిమాల్లో బ్యానర్లు, గోడలపై పేర్లతోపాటు సైన్ బోర్డులపై పేర్లు రాశారు. తరువాత 1986లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో మహారాష్ట్ర, నిజామాబాద్‌లలో కొన్ని సంవత్సరాలు పనిచేసి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మరోవైపు తనకు వచ్చిన చిత్రకళను అశ్రద్ధ చేయలేదు. కథకు అనుగుణంగా, సన్నివేశాన్ని బట్టి పుస్తకాల్లో మేగజైన్లలో, మాసపత్రికలల్లో కవర్‌పేజీలపై ముఖచిత్రాలు వేయడం ప్రత్యేకతగా మలుచుకున్నారు. మనిషి ఎదురుగా నిల్చుంటే చూడ చక్కగా బొమ్మలు గీస్తారు. పెన్సిల్‌తో బొమ్మలు గీయడంలో చాలా ఫాస్ట్. తైలవర్ణ చిత్రాలు, వాటర్ కలర్స్, స్కెచెస్‌తో పలు చిత్రాలు గీశారు. కాన్వాస్‌పై అయిల్ పెయింటింగ్ వేయడం ఈయన స్పెషాలిటి. 1977లో ఎన్టీఅర్, జమునల ఫోటోలు అద్భుతంగా గీసి వారికి కానుకగా అందజేసి ప్రశంసలందుకున్నారు. వాటర్ కలర్లతో గీసిన మహాత్ముడి బొమ్మ, ఇండియన్ ఇంక్‌తో వేసిన అంబేడ్కర్ బొమ్మలు, పెన్సిల్‌తో వేసిన పలు బొమ్మలు ఆకట్టుకుంటాయి.
గాయకుడిగా.....
మాస్టర్ చంద్రశేఖర్‌రావు మంచి గాయకుడు కూడా. చిన్ననాటినుంచి పాటలంటే ఇష్టం. ఘంటసాల పాటలంటే మరీ ఇష్టం. పలు పాటలను వినసొంపుగా పాడుతూ ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, వేదికలపై పలు ప్రదర్శనలిచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఘంటసాల సంగీత విభావరుల్లో ఆయన గాత్రం పలువురి ప్రశంసలందుకుంది.
నటుడిగా..
నటనా రంగంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ఏ వేషం వేసినా అందులో ఒదిగిపోయేవారు.1996లో మూడు ప్రశ్నలు, నాటకంలో బైరాగి వేషంలో మంచి నటన కనబర్చారు.
సంతృప్తి కంటే మించింది లేదు
పలు కళల్లో ప్రవేశమున్న నాకు జీవితకాలం గుర్తుంచుకోదగ్గ తీపి జ్ఞాపకాలు మిగిలాయి. అంతకుమించి సంతృప్తి ఏముంది. ప్రస్తుతం మల్కాజిగిరిలోని ఒక గదిని అద్దెకు తీసుకొని చిన్నా, పెద్ద తేడా లేకుండా ఉచితంగా డ్రాయింగ్ శిక్షణ ఇస్తున్నా. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే మరింతమందికి శిక్షణఇస్తా.– బేతపూడి చంద్రశేఖర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment