కోస్గిలో జరిగిన రోడ్డు షోలో అభివాదం చేస్తున్న రేవంత్‌రెడ్డి
కోస్గి (కొడంగల్) : రాష్ట్రంలో జరిగేవి ముందస్తు ఎన్నికలైతే.. కొడంగల్‌లో మాత్రం ప్రజల ఆత్మ గౌరవం, చింతమడక దొరల పెత్తనానికి మధ్య జరుగుతున్న పోటీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంతా మంచి జరిగితే మళ్లీ ప్రచారానికి వస్తానని, లేకుంటే జైలు నుంచే నామినేషన్ పంపిస్తానని.. రేవంత్‌రెడ్డిని గెలిపించుకుని గుండెల్లో పెట్టుకుంటారనే నమ్మకంతో వెళ్తున్నానని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఒకేరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు బుధవారం రాత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఆయన ప్రచారం ప్రారంభించక ముందే హైదరాబాద్‌లోని ఆయన నివాసంపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయనే సమాచారం అందింది. అయితే, రేవంత్‌రెడ్డి ముందుగా ప్రకటించిన విధంగానే ప్రచారాన్ని ప్రారంభించినా ఐటీ అధికారుల పిలుపుతో కోస్గి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు.
పూజలు, ర్యాలీలు
కోస్గి మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేసిన రేవంత్‌రెడ్డి కోస్గి వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ఉండే మోదీ, గల్లీలో ఉండే కేడీ కేసీఆర్ కుట్రలు కుతంత్రాలు పన్నారని విమర్శించారు. తాను నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటుండగా హైదరాబాద్‌లోని తన నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు చేయించారన్నారు. కేసీఆర్‌ను బొందపెట్టేందుకు తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలు, మూడెకరాల భూమి దక్కని దళితులు, నిరుద్యోగులు, రిజర్వేషన్లు దక్కని మైనార్టీలు, గిరిజనులు, రుణమాఫీ కాని రైతులు ఏకమై కదనరంగంలోకి దిగారన్నారు.
సన్నాసులపై కాదు..
ఇక్కడి ప్రజల పోరాటం చింతమడక చీటర్ కేసీఆర్ మీదనే తప్ప.. సన్నాసుల మీద కాదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి అంటున్న కేసీఆర్, తన స్వగ్రామమైన చింతమడకలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కొండగట్టులో 60 మంది చనిపోతే చూడని కేసీఆర్‌కు మనసు ఉందా? అని ప్రశ్నించారు. తనపై ఓటుకు నోటు కేసు పెట్టించి 32 రోజులు జైల్లో పెట్టించాడన్నారు. ‘ఆనాడు జైలులో తిన్న చిప్పకూడు మీద ఒట్టేసి చెబుతున్నా.. బిడ్డా కేసీఆర్ నిన్ను, నీ కాందాన్‌ను గద్దె నుంచి దించేవరకు నిద్రపోనని శపథం చేస్తున్నా’అని పేర్కొన్నారు. కేసీఆర్ పెట్టిన కేసులు తననేమీ చేయకపోవడంతో మోదీ దగ్గరకు వెళ్లి తన వల్ల కావడంలేదని మోకాళ్లపై నిలిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ అంటూ తనపై ఉసిగొల్పారన్నారు.
తనపై కొత్తగా కేసులు పెట్టి నాలుగు నెలలు జైలులో పెట్టే కుట్ర జరుగుతోందని తెలిపారు. ఇదే జరిగితే తనకు ఇదే చివరి ఎన్నికల ప్రచారం కావొచ్చని.. కొడంగల్‌లో జరు గుతున్న కుట్రను ప్రజలు గుర్తించి ప్రతి ఒక్కరూ రేవంత్‌రెడ్డిగా మారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘బిడ్డా కేసీఆర్ గుర్తు పెట్టుకో.. నీకు, నీవు పోతే నీ వారసులకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా.. నేను పోతే రేవంత్‌రెడ్డి ఏం చేస్తాడనుకుంటున్నావేమో నీవు చేసిన పాపాలు, అధికారం నీ వారసులదే కాబట్టి వడ్డీతో సహా చెల్లిస్తా’అని స్పష్టం చేశారు. ‘రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తే 30 వేల మెజార్టీ, జైలులో ఉంటే 50 వేల మెజార్టీ ఖాయం. బిడ్డా కేసీఆర్ ఎన్నికలయ్యాక నా సత్తా తెలుస్తుంది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment