
రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్టణం: తెలంగాణలో నిరంతర విద్యుత్ కు చంద్రబాబు ఉదారతే కారణమని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం విశాఖ టీడీపీ మహానాడులో తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్ట్స్ -ప్రాజెక్ట్స్ రీడిజైన్స్- భూసేకరణ పై పార్టీ నేత భూపాల్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రేవంత్ బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలంటే రెండు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు.
ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే తాము ఏ వైపు అని కేసీఆర్ ప్రశ్నించారని, ఇందుకు తమ సమాధానం ప్రజల పక్షం అని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఒప్పించుకుంటామని తెలిపారు. ఎన్నికల హామీలను అమలుచేయని సీఎంగా కేసీఆర్ నిలిచిపోతారని అన్నారు. 1100 రోజుల టీఆర్ ఎస్ పాలనలో 3300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న 1250 మందిని గుర్తించడంలో సర్కారు విఫలమైందని మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా సవరణ చేసిందని ఆరోపించారు.