ఎన్ కన్వెన్షన్ హాల్కు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తాత్కాలిక బెయిల్పై విడుదలైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. కుమార్తె నిశ్చితార్థం సందర్భంగా ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన చర్లపల్లి జైలు నుంచి ఉదయం 6గంటలకు బయటకు వచ్చారు.
మీడియా సహా రాజకీయ నేతలను కలవకూడదని షరతులు విధించడంతో ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆయన కుమార్తె నిశ్చితార్థం జరగనుంది. తన ఇంటి వద్ద నుంచి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డితో కలిసి నిశ్చితార్థ వేదికకు బయల్దేరారు.