హసీనాబేగం (తహశీల్దార్)
- తహసీల్దార్‌పై దాడికి నిరసనగా ఉద్యోగుల ఆందోళన
- కలెక్టరేట్, ఆర్డీఓ, మండల కార్యాలయాల్లో నిలిచిన కార్యకలాపాలు
- ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మీనా హామీతో అందోళన విరమణ
హైదరాబాద్‌సిటీ: నగరంలోని బహదూర్‌పురా మండల తహసీల్దార్ హసీనా బేగంపై దాడిని నిరసిస్తూ గురువారం జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం, తహశీల్దార్ అసోసియేషన్‌లు సంయుక్తంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ధర్నాకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం, వీఆర్‌ఓ సంఘం, టీఎన్‌జీఓలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. స్తంభించిన కార్యకలాపాలు తహశీల్దార్‌పై దాడికి నిరసనగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయాలు, పదహారు మండల కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, కలెక్టరేట్‌లోని రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి, ధర్నాలో పాల్గొన్నారు.
దీంతో అన్నిచోట్లా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. నల్లబ్యాడ్జీలు ధరించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్ల కార్డులు పట్టుకొని విధుల నిర్వహణలో భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ధర్నాలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగుల ఆందోళనకు జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, డీఆర్‌ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురామ్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్లు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో అధికార, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు లచ్చిరెడ్డి, శివశంకర్, కృష్ణ యాదవ్, హరినాథ్ జిల్లా నాయకులు రామకృష్ణ, నాగరాజారావు, చంద్రకళ, జహీరుద్దీన్, మల్లేష్ కుమార్, లీలా, సి.హెచ్. వెంకటేశ్వర్లు, చంద్రకళ మాట్లాడారు.
మీనా హామీతో అందోళన విరమణ..
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మీనా హామీతో ధర్నాతో పాటు శుక్రవారం నుంచి నిర్వహించతలపెట్టిన అందోళన కార్యక్రమాలను విరమింపజేస్తున్నట్లు తహశీల్దార్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. మీనాకు వినతి పత్రం సమర్పించగా తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్నా వేదిక వద్దకు వచ్చిన జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.