రైస్‌మిల్లుల్లో నల్లబెల్లం డంప్‌లు
జోరుగా చీకటి వ్యాపారం
* బియ్యం చాటున బెల్లం, పటిక విక్రయాలు
* రోజు రూ.5 లక్షల వ్యాపారం
* పోలీసుల సహకారంతోనే బిజినెస్
భీమారం : రైస్‌మిల్లులు, పాడుబడిన గోదాంలు, జనావాసం లేని భవనాల్లో చీకటి వ్యాపారం సాగుతోంది. హసన్‌పర్తి కేంద్రంగా బెల్లం, పటిక వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. శనివారం ఎక్సైజ్ అధికారులు సీతంపేట క్రాస్‌లోని ఓ రైస్‌మిల్లులో దాడులు నిర్వహించగా భారీగా బెల్లం నిల్వలు పట్టుబడిన విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా ఎక్సైజ్ అధికారులు ఇంత పెద్దమొత్తంలో బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకోలేదని ఎక్సైజ్ అధికారులే చెప్పడం గమనార్హం.
జిల్లాలో నల్లబెల్లం వ్యాపారులు సిండికేట్‌గా మారినట్లు తెలుస్తోంది. పరకాలకు చెందిన బెల్లం వ్యాపారి సదాశివుడు నగరానికి చెందిన మరో వ్యాపారితో కలిసి.. రెండున్నర ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడైంది. సదాశివుడికి పరకాలలో బెల్లం షాపు ఉంది. ఇందులో అతడు ప్రజల అవసరాలకు బెల్లం విక్రయించాల్సి ఉండగా.. గుడుంబా తయూరీ కోసం నల్లబెల్లం, పటిక విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు రవాణా
పరకాల నుంచి ప్రతి రోజు వివిధ ప్రాంతాలకు బెల్లం, పటిక దిగుమతి చేయడానికి ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో సీతంపేట క్రాస్ వద్ద ఉన్న ఓ రైస్‌మిల్లును లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రైస్‌మిల్లులో పెద్దఎత్తున బెల్లం, పటిక నిల్వ చేశాడు. ఇక్కడి నుంచి ట్రాలీ, ఆటోల ద్వారా నగర పరిధిలోని కోమటిపల్లి, హరిశ్చంద్రనాయక్ తండా, సిద్దాపురం, గుండ్లసింగారం, సీతంపేట, మడికొండ, కడికొండకు బెల్లం సరఫరా చేస్తుండేవారు. ఈ ప్రాంతాలకు రోజూ సుమారు రూ.5 లక్షల వ్యాపారం చేస్తున్నారంటే గుడుంబా తయూరీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గుట్టుచప్పుడు కాకుండా చేసిన వ్యాపారం.. మూడు నెలలకే రట్టయిపోయింది.