- అధికారుల మొక్కుబడి చర్యలు
- రైస్ మిల్లర్ల సంఘం తీరుపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలనే నిబంధనను లెక్క చేయడం లేదు. ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసిన వారిపై చర్యల విషయంలో అధికారులు అలసత్వం చూపిస్తున్నారు. ధాన్యం స్వాహాపరులకు రైస్ మిల్లర్ల సంఘం పెద్దలు అండగా నిలుస్తున్నారు. ఇలా అధికారులు, సంఘం ముఖ్యనాయకుల అండదండలతో ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసే వారి సంఖ్య ప్రతి సీజనుకు పెరుగుతోంది.
రెండేళ్ల క్రితం ప్రభుత్వ వరి ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లలో 12 మంది ఇప్పటికీ బియ్యం ఇవ్వడం లేదు. ఇలా రూ.14.80 కోట్ల విలువైన ధాన్యం మిల్లర్లపాలైంది. ఈ బియ్యాన్ని తిరిగి రాబట్టే విషయంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా మిగిలిన మిల్లర్లు ఇదే రకంగా వ్యవహరించేందుకు సహకరిస్తున్నారు.
ఎగవేతపై చర్యలు శూన్యం
2013-14 మార్కెటింగ్ సీజనులో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం 1.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. పౌర సరఫరాల శాఖ ఈ ధాన్యాన్ని జిల్లాలోని 89 రైస్ మిల్లులకు ఇచ్చింది. ఈ ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు వెంటనే బియ్యంగా మార్చి లెవీ సీజనులోపు ఇవ్వాలి. నిబంధన ప్రకారం.. ప్రతి క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల బియ్యాన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాలి.
సాంకేతికంగా ఏటా అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు లెవీ మార్కెట్ సీజను ఉంటుంది. 2013-2014 లెవీ సీజను 2014 సెప్టెంబరు 30తో ముగిసింది. గడువు ముగిసి ఏడాది కావస్తున్నా 12 మంది రైస్ మిల్లర్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో బియ్యం ఇవ్వలేదు. ఈ 12 మంది మిల్లర్లకు ఇచ్చిన ధాన్యంలో 7,416 టన్నుల ధాన్యం దుర్వినియోగమైనట్లు తేలింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 5,043 టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతాయి. ఈ బియ్యాన్ని, వీటికి సంబంధించిన ఖాళీ సంచులను మిల్లర్లు ఇవ్వలేదు. బియ్యం, బస్తా సంచుల విలువ కలిపి రూ.14.80 కోట్లు ఉంటుందని పౌర సరఫరాల సంస్థ లెక్కగట్టింది. ప్రభుత్వానికి ఇంత మొత్తాన్ని ఎగవేస్తున్న వారిపై తూ.తూ.మంత్రంగా కేసులు నమోదు చేయడం తప్పితే బియ్యం రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు.
బియ్యం దొంగలు
Published Sat, Jun 27 2015 4:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement