సుక్కలు చూపిస్తున్న సన్నాలు
మెదక్: సన్న బియ్యం ధరలు సుక్కలనంటుతున్నాయి. క్వింటాలుకు రూ.4,300 నుంచి 4,500 వరకు ధర పలుకుతున్నాయి. రైస్ మిల్లర్లంతా ఎఫ్‌సీఐ, లెవీల కోసం దొడ్డు వడ్లను మరాడిస్తుండటం, ఉన్న సన్న బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో రైతులు దొడ్డు రకం వరి పండించడానికే ఆసక్తి చూపుతుంటారు. సుమారు 15,000 హెక్టార్లలో సన్న వడ్లు సాగు చేస్తారు.
తద్వారా7.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండుతోంది. చాలామంది రైతులు చెరువులు, కుంటలు, కాలువలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. దీంతో సమయానికి నీరు అందదనే ఉద్దేశంతో దొడ్డు రకాన్ని సాగుచేస్తుంటారు. అయితే బోరు నీటి సదుపాయం ఉన్న చోట మాత్రం సన్న రకం సాగుచేస్తున్నారు. గతేడాది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. దీంతో కోదాడ, నర్సారావుపేట, మిర్యాలగూడ, నల్గొండ, తదితర జిల్లాల నుంచి సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి, స్థానిక మిల్లులో మర ఆడించి బియ్యం విక్రయిస్తుంటారు.
రాను రాను జిల్లాలో సన్న బియ్యానికి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం మిల్లర్లంతా దొడ్డు రకంపైనే దృష్టి పెట్టారు. దీంతో మొన్నటివరకు రూ 3,800 నుంచి 4,000 పలికిన సన్న బియ్యం.. ఇప్పుడు రూ. 4,300 నుంచి రూ. 4,500 వరకు విక్రయిస్తున్నారు. అయితే కొంతమంది మిల్లర్లు ధాన్యం అక్రమ నిల్వలకు పాల్పడుతున్నందువల్లే ధరలు పెరిగాయని అంటున్నారు. పౌరసరఫరాల శాఖ పట్టించుకోకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
దరలు ఇష్టారీతిన పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే పెరుగుతున్న బియ్యం రేట్లను చూసి ఆందోళనకు లోనవుతున్నారు. యేడాదికి రెండుసార్లు పెరిగిన డీఏలు బియ్యం కొనుగోళ్ళకే సరిపోతున్నాయంటున్నారు. అలాగే ఈసారి అకాల వర్షాల వల్ల దొడ్డు ధాన్యం కూడా తడిసిందని దీంతో దొడ్డు బియ్యం ధరలు కూడా పెరిగాయని తెలుస్తోంది. ఈ రకం బియ్యం గతంలోనే క్వింటాలుకు రూ 2,200 నుంచి రూ 2,600కు పెరిగాయని రైతులు చెపుతున్నారు. అయితే గ్రామాల్లో కొంతమంది చిరు వ్యాపారులు తెలుపు రంగు రేషన్ కార్డులను లబ్ధిదారుల నుంచి తనఖా పెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వడ్డీ లేకుండా రూ. 5,000 వరకు రుణాలిచ్చి, వడ్డీకి బదులుగా వారి రేషన్ కార్డులపై వచ్చే సబ్సిడీ బియ్యాన్ని తీసుకొని మిల్లర్లకు అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇవే బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ఎఫ్‌సీఐకి విక్రయిసున్నట్లు తెలుస్తోంది.