భగ్గుమంటున్న బియ్యం | Rice Prices Hikes in Hyderabad | Sakshi
Sakshi News home page

భగ్గుమంటున్న బియ్యం

Published Sat, Jul 27 2019 9:39 AM | Last Updated on Thu, Aug 1 2019 12:18 PM

Rice Prices Hikes in Hyderabad - Sakshi

సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్‌లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.50 నుంచి రూ.60 వరకు చెల్లించాల్సి వస్తోంది. గతేడాది ఫస్ట్‌ క్వాలిటీ ఏడాది పాత బియ్యం ధర కిలో రూ.45 లోపే ఉంది. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే అంతకుముందు ఏడాది కంటే 20 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికంగా సేకరించారు. మార్కె ట్‌ డిమాండ్‌ కంటే ఎక్కువ బియ్యం వచ్చినా ధరలు మాత్రం పెరగడం గమనార్హం. అయినా ధరలు మాత్రం నియత్రించే పౌర సరఫరాశాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు.

పన్నులు ఎత్తివేసినా తగ్గని ధర
జీఎస్టీ రాక ముందు మిల్లర్లు, వ్యాపారులు క్వింటాల్‌పై 4 శాతం పన్ను చెల్లించేవారు. జీఎస్టీ అమలతో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా తొలగించారు. అందులో భాగంగా బియ్యంపై కూడా వ్యాట్‌ను కూడా పూర్తిగా ఎత్తివేశారు. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రైస్‌ మిల్లర్లు ధాన్యం సేకరించి వ్యాపారులకు అమ్మితే గతంలో విధించిన ఒక శాతం పన్నును కూడా ప్రభుత్వం తొలగిస్తూ  2019 జీవో నంబర్‌ 219 జారీ చేసింది. దీంతో రైస్‌ మిల్లర్లు కేవలం ఒకశాతం మార్కెట్‌ ఫీజు మాత్రమే చెల్లించాలి. ప్రభుత్వం మిల్లర్లకు, బియ్యం వ్యాపారులకు ఇన్ని వెసలుబాట్లు కల్పించినా ధరలు మాత్రం తగ్గించకపోవడం గమనార్హం. ప్రభుత్వ పర్యవేక్షణ లేనందునే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  

గ్రేటర్‌లో ధరల మోత  
గ్రేటర్‌ పరిధిలో అధికారులు పట్టించుకోకపోవడంతో  హోల్‌సేల్‌ మార్కెట్‌లో బియ్యం ధరలకు, రిటైల్‌ ధరలకు పొంతన ఉండడం లేదు. గ్రేటర్‌ పరిధిలో 250 మంది రైస్‌మిల్లర్లు ఉన్నట్లు సమాచారం. ఏటా ఒక్కో మిల్లర్‌ వద్ద 40 నుంచి 50  టన్నుల బియ్యం నిల్వలు పెరుగుతున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్‌లో రోజుకు 35 నుంచి 40 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగం అవుతున్నట్లు అధికారుల అంచనా. గతంలో పోలిస్తే రోజుకు 5 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగం పెరిగింది. రిటైల్‌ వ్యాపారులకు తక్కువ ధరలకే బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు  . ప్రస్తుతం మిల్లర్‌ ధర క్వింటాల్‌కు రూ.3200 నుంచి 3500 పలుకుతోంది. మార్కెట్‌కు చేరిన తర్వాత రిటైల్‌ వ్యాపారులు చెప్పిందే ధర. ప్రస్తుతం పాత సన్నబియ్యం ఫైన్‌ క్వాలిటీ క్వింటాల్‌కు రూ.5000 నుంచి 5500 చేరింది.
గ్రేటర్‌ పరిధిలో ఉన్న దాదాపు 2500 మంది రిటైల్‌ వ్యాపారులు బియ్యం ధరలను విపరీతంగా పెంచి అమ్ముతున్నారు. చిన్నా చితకా కిరాణా వ్యాపారులు కూడా ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో క్వింటాల్‌ సన్నబియ్యం ధర రూ.4200 పలుకగా ప్రస్తుతం ప్రతి క్వింటాల్‌పై రూ.800 వరకు పెరుగుదల కనిపించడం గమనార్హం. దీంతో జీఎస్టీ పరిధిలోంచి బియ్యాన్ని తొలగించినా కూడా సామాన్యులకు ఏ విధమైన ప్రయోజనం లేకుండా పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement