సాక్షి సిటీబ్యూరో: బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. రెండేళ్లుగా ధాన్యం దిగుబడి భారీగా పెరిగి.. మార్కెట్‌ను ముంచెత్తుతున్నా బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు. మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల మాయాజాలం కారణంగానే బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రస్తుతం కిలో బియ్యం రూ.55కు తక్కువ దొరకడం లేదు. దీంతో రోజుకూలీలు, చిరు వ్యాపారులు, నిరుపేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఈసారి వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అటు ప్రభుత్వ గోదాములు.. ఇటు మిల్లర్ల గోదాముల్లో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. మార్కెట్లో మాత్రం బియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయి.
రెండేళ్లుగా బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని మిల్లులకూ గత ఏడాది ఖరీఫ్‌తో పాటు ఈ ఏడాది రబీలో పండిన ధాన్యం భారీగా చేరింది. దీనిని బియ్యంగా మార్చి మిల్లర్లు ప్రభుత్వానికి ఇస్తున్నారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన కొందరు మిల్లర్లు మాత్రం బియ్యాన్ని తమ గోదాముల్లో నిల్వచేసుకుని మంచి రేటుకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా పంట రావడంతో బియ్యానికి మంచి రేటు రావడంలేదని వారు వాపోతున్నారు. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసే హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం అధిక ధరలతో వినియోగదారులను దోచేస్తున్నారు.
రెండింతలైన వరి ఉత్పత్తి
2017–18 ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18.25 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మార్కెట్‌కు వచ్చిందని, 2018–19 ఖరీఫ్‌లో ఇది రెట్టింపై...40.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు చేరిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు మిల్లర్ల నుంచి క్వింటాల్ బియ్యాన్ని రూ.3,000 నుంచి 3,600 మధ్య ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదే బియ్యాన్ని రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు మాత్రం క్వింటాల్‌కు 4,800 నుంచి 5500 రూపాయల వరకూ అమ్ముతున్నారు. అంటే వ్యాపారులు ఒక్కో కిలోకు దాదాపు 20–25 రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో ఇంత మొత్తంలో బియ్యం వ్యాపారంపై లాభాలు ఉండేవి కావని మార్కెట్ వర్గాల అభిప్రాయం.
జీఎస్టీ మినహాయించినా...
వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించడం వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు 2016 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం బియ్యంపై ఉన్న 1 శాతం మార్కెట్ ఫీజును కూడా రద్దు చేసింది. ప్రస్తుతం కేవలం వరి ధాన్యంపై మిల్లర్ల నుంచి 1 శాతం మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధరలు మండిపోతున్నాయి. బియ్యం ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే చెప్పాలి. రిటైల్ వ్యాపారులు కేజీ బియ్యాన్ని 20 నుంచి 25 రూపాయల లాభానికి అమ్ముకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రేటర్ పరిధిలో రిటైల్ వ్యాపారమే రోజుకు రూ.200 నుంచి 250 కోట్ల మేరకు జరుగుతోంది. ఇందులో వ్యాపారుల లాభం 20 కోట్ల నుంచి 25 కోట్ల మేరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచన.
అప్పటి ధరలే ఇప్పటికీ..
గత మూడేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు దిగుబడి బాగా తగ్గింది. దీంతో ఆటోమేటిక్‌గా బియ్యం ధరలు పెంచేశారు. కానీ ఇప్పుడు దిగుబడి పెరిగాన గతంలో పెంచిన రేట్లనే అమలు చేస్తున్నారు. జీఎస్టీకి ముందు మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల నుంచి ప్రభుత్వం 5 శాతం వ్యాట్‌ను వసూలు చేసింది. ప్రసుత్తం వ్యాట్ కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బియ్యం ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment