ఆదిలాబాద్ కల్చరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ ఆస్పత్రి తాగునీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతోంది. ఇదివరకు ఎప్పుడూ లేని రీతిలో తాగునీటి సరఫరా లేక రోగులకు శస్త్రచికిత్సలు నిలిపివేసిన దుస్థితి దాపురించింది. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మధ్య విభేదాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
రిమ్స్ ఆస్పత్రిలో నీటి ఎద్దడికి కారణం తాము కాదని మున్సిపల్ అధికారులు బహిరంగంగా చెబుతున్నారు. రిమ్స్ అధికారులకు నోటీసులు పంపించినా నీటి పన్ను రూ.17 లక్షలు చెల్లించలేదని, అయినా నీటిని సరఫరా చేస్తున్నామని అంటున్నారు. రిమ్స్ అధికారులు మున్సిపల్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వారు అంటున్నారు. దీంతో రిమ్స్, మున్సిపల్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
రిమ్స్ అధికారులదే నిర్లక్ష్యం?
రిమ్స్‌లో నీటి ఎద్దడి నెలకొనడానికి రిమ్స్ అధికారులదే నిర్లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రికి రోజుకు 4 లక్షల లీటర్ల నీరు అవసరం. కానీ మున్సిపల్ నుంచి రోజుకు 80 వేల నీరు సరఫరా అవుతోంది. బోర్లతో నీటి సరఫరా లక్షా 20 వేల లీటర్లు మాత్రమే జరుగుతోంది. ఇంకో 2 లక్షల లీటర్ల నీటి సరఫరా జరగడం లేదు. రిమ్స్‌లో 8 బోర్లు ఉన్నా వాటిలో విద్యుత్, బోర్ల సామర్థ్యం, వివిధ కారణాలతో సక్రమంగా పనిచేయడం లేదు. ఈ కారణంగా నీటి ఎద్దడి ఎదురవుతోంది. ఎప్పటికప్పుడు నీటి సామర్థ్యాన్ని, అవసరమున్న నీటిని పర్యవేక్షించాల్సిన సిబ్బంది సైతం కరువయ్యారు. సోమవారం ప్రధానంగా ముందస్తు పర్యవేక్షణ లోపంతోనే నీరు లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్‌లో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో రోగులు అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఎదురైంది.
నీటి సరఫరాలో సమస్య
రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకుని వారికి జరిగే చికిత్సల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా నీటి సరఫరా చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా తె లిపారు. ఆదిలాబాద్ మండలంలో ప్రధాననీటి వనరులైన లాండసాంగ్విలో ట్రాన్స్‌ఫార్మర్ పాడైపోవడంతో సోమవారం నీటి సరఫరాలో ఆలస్యం జరిగింది. ఈ కారణంగా పట్టణంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేశారు.
రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనకు మున్సిపల్ అధికారులు కారణం కాదని, మున్సిపాలిటీకి రిమ్స్ రూ.17 లక్షలు బకాయిలు ఉన్నా సరఫరాను నిలిపివేయకుండా నిరంతరం రోజుకు 80 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ మనీషా ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి విధులు నిర్వహించిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుందని రిమ్స్ డెరైక్టర్ శశిధర్ తెలిపారు. శని, ఆదివారాల్లో తాను సెలవుపై ఉండడంతో నీటి సమస్య తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు. మున్సిపల్‌కు చెల్లించాల్సిన రూ.17లక్షల నీటి పన్నును వంతుల వారీగా చెల్లించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏది ఏమైనా రిమ్స్‌కు మున్సిపాలిటీకి మధ్య విభేదాలు తొలగించి తమకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని రోగులు, ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
రిమ్స్ Vs మున్సిపల్
Published Wed, Jul 23 2014 12:45 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement