కొయ్యబొమ్మకు ఊతం | Rise to a wooden doll | Sakshi
Sakshi News home page

కొయ్యబొమ్మకు ఊతం

Published Sat, Jun 7 2014 2:31 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

కొయ్యబొమ్మకు ఊతం - Sakshi

కొయ్యబొమ్మకు ఊతం

పొనికి మొక్కల పెంపకానికి అటవీశాఖ శ్రీకారం
ఏడాదిలోగా చర్యలు  తీసుకుంటామన్న మంత్రి


రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన నిర్మల్ కొయ్యబొమ్మల తయారీకి వినియోగించే పొనికి కర్ర మొక్కల పెంపకానికి అటవీశాఖ శ్రీకారం చుట్టనుంది. ఆదిలాబాద్ అటవీ ప్రాం తంలో ఏడాదిలోగా ఈ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటామని ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రకటించారు. దీంతో ఈ బొమ్మలు తయారు చేసే కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ కళనే నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు పొనికి కర్ర దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అటవీశాఖ కలప డిపోల నుంచి ఈ కర్రను కొనుగోలు చేస్తున్నారు. ఈ అరుదైన వృక్ష సంపద కేవలం ఆదిలాబాద్ అడవుల్లో పెరుగుతుంది. ముఖ్యంగా ఖానాపూర్, ఇచ్చోడ, మంచిర్యాల, బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిల్లో ఈ వృక్షాలు పెరుగుతాయి. స్మగ్లర్ల దాటికి ఈ వృక్ష సంపద అంతరించిపోతోంది.

దీంతో ఈ పొనికి కర్ర కొరత కార్మికులకు చేతినిండా పనిలేకుండా చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఈ కొయ్యబొమ్మలు తయారు చేసే కళాకారుల కుటుంబాలు సుమారు 40 వరకు ఉంటాయి. వారి తరాల నుంచి ఆ కుటుంబాలు ఈ కళనే నమ్ముకుని జీవిస్తున్నారు. పొనికి కర్ర కొరత కారణంగా చేతినిండా పనిదొరక్క పోవడంతో రానున్న తరాలు ఈ కళను నమ్ముకునేందుకు ఇష్టపడటం లేదని కళకారులు పేర్కొంటున్నారు. దీంతో తమతోనే ఈ అరుదైన కళ అంతరించిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 పట్టించుకోని గత ప్రభుత్వాలు..
 ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో పొనికి చెట్లను పెంపకం చేపట్టి తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఈ కళాకారులు విజ్ఞప్తి చేసినప్పటికీ, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని వారు పేర్కొంటున్నారు. కొత్త రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ పని సులభమయ్యేందుకు ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఉత్పత్తులు విక్రయించేలా కొత్త సర్కారు సహకారం అందించాలని అంటున్నారు. కానీ ఎట్టకేలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రామన్న చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, పొనికి కర్ర భవిష్యత్తు అవసరాలు తీర్చాలంటే ఇప్పటి నుంచే పొనికి మొక్కలను నాటాలని కళాకారులు పేర్కొంటున్నారు. ఈ కర్ర చేతికందాలంటే కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని వారు పేర్కొంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement