రోడ్డు పక్కన ఆపడమే శాపమైంది..! | Road Accident Near Jadcherla | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కన ఆపడమే శాపమైంది..!

Published Mon, Aug 19 2019 8:07 AM | Last Updated on Mon, Aug 19 2019 8:10 AM

Road Accident Near Jadcherla - Sakshi

సాక్షి, జడ్చర్ల : రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి నిద్రించడమే ఆ వ్యక్తి పాలిట శాపమైంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని ముదిరెడ్డిపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలిలా.. అనంతపూర్‌ జిల్లా కంబదూర్‌ మండలం రాంపురానికి చెందిన మహేందర్‌(32), అతని చిన్నాన్న కుమారుడు పవన్‌కుమార్‌ హైదరాబాద్‌ నుంచి అనంతపూర్‌కు బొలెరో వాహనంలో టైల్స్‌ లోడ్‌ చేసుకొని తీసుకెళ్తున్నారు. ఈక్రమంలో నిద్రవస్తుండడంతో శనివారం రాత్రి 11గంటల ప్రాంతంలో ముదిరెడ్డిపల్లి వద్ద రోడ్డు పక్కన తమ బొలెరో వాహనాన్ని నిలిపారు.

మహేందర్‌ వాహనం టాప్‌పై నిద్రించగా.. పవన్‌కుమార్‌ వాహనంలోపల నిద్రించారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంతో హైదరాబాద్‌ నుంచి నారాయణపేట్‌కు వెళ్తున్న ఆర్టీసి బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో  వాహనంపై నిద్రిస్తున్న మహేందర్‌ రోడ్డుపై పడగా.. అతనిపై వాహనం పడడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కానిస్టేబుల్‌ జనార్దన్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement