తాటిగడ్డ తండా సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొన్న మరో లారీ (ఫైల్)
కొత్తూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. స్థానిక ట్రాఫిక్, సివిల్ పోలీసులు, హైవే సిబ్బంది రోడ్డుపక్కన ఇష్టారాజ్యంగా నిలుపుతున్న వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో విలువైన ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
ప్రమాదాలు నిత్యకృత్యం
మండల పరిధిలోని తిమ్మాపూర్ శివారులోని ఐఓసీఎల్(ఇండేన్ ఆయిల్ బాట్లింగ్ ప్లాంట్)కు చెందిన భారీ గ్యాస్ బుల్లెట్ వాహనాలను రోడ్డు పక్కనే నిలుపుతున్నారు. ఈ రహదారిపై వాహనాలు గంటకు దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులతో పాటు ఆర్టీసీ, స్కూల్, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. అయితే, రోడ్డు పక్కనే నిలిపిన గ్యాస్ బుల్లెట్ వాహనాలను ఢీకొంటే.. ఆ ప్రమాద పరిస్థితిని ఊహించడం, నష్టాన్ని
అంచనా వేయడం కష్టమే. వాహనాలను నిలుపుతున్న ప్రాంతానికి దగ్గరలో భారీగా గ్యాస్ నిల్వ ఉండే ప్రదేశం, పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయినప్పటికీ రోడ్డు పక్కన నిలుపుతున్న గ్యాస్ బుల్లెట్ వాహనాల గురించి అటు పోలీసులు ఇటు ప్లాంట్ ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆగితే.. ఇక అంతే సంగతి
కొత్తూరు మండల పరిధి తిమ్మాపూరు చెక్‌పోస్టు మొదలు షాద్‌నగర్ టోల్‌ప్లాజా వరకు విస్తరించి ఉంది. ఈ జాతీయ రహదారి కొత్తూరు, షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉంది. సుమారు 20 కిమీ మేర పొడవున్న ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే, అక్కడక్కడా పరిశ్రమల సమీపంలో భారీ వాహనాలు ఇష్టానుసారంగా నిలుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్‌ప్లాజా సిబ్బంది, పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా ఫలితం శూన్యం. రాత్రుల్లో ప్రమాదకరంగా నిలిపి ఉంచిన వాహనాలను వెనుక నుంచి ఢీకొన్న ఘటనల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు.
పరిశ్రమల సమీపంలో..
తిమ్మాపూరు, కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్ ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జాతీయ రహదారిపై ఎక్కువగా కొలువుదీరడంతో సరుకుల లోడింగ్, అన్ లోడింగ్‌కు భారీ లారీలు వస్తాయి. ఈ వాహనాలను నిర్వాహకులు రహదారిపైనే నిలుపుతున్నారు. కొన్నిసార్లు ఆర్డర్లు రాకపోవడంతో రోజుల తరబడి అవి అలాగే నిలిపి ఉంటున్నాయి. తిమ్మాపూరు ఐఓసీఎల్ పరిశ్రమకు వచ్చే భారీ గ్యాస్ బుల్లెట్ వాహనాలను పదుల సంఖ్యలో జాతీయ రహదారి పైనే పార్కింగ్ చేస్తున్నారు.
జరిగిన ప్రమాదాలు ఇవీ..
- జాతీయ రహదారిపై లారీలను నిలిపి ఉంచడంతో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పోలీసులు కూడా దుర్మరణం పాలయ్యారు. నందిగామ శివారులో ట్రాక్టర్, లారీ ఢీకొన్న ఘటనలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం వెల్లిన ఓ ఏఎస్సై, కానిస్టేబుల్‌ను వెనుక నుంచి మరో లారీ ఢీకొంది ఈ ప్రమాదంలో ఏఎస్సై చనిపోగా.. కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.
- సాంకేతిక లోపంతో తిమ్మాపూరు శివారులో ఆగిన కంటెయినర్‌ను వెనుక నుంచి వచ్చిన పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎంఎస్‌ఎన్ పరిశ్రమ ఎదురుగా నిలిపిన లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రమాదాలు పార్కింగ్‌ల ఇష్టారాజ్య పార్కింగ్‌తో జరుగుతున్నా పోలీసులు పరిష్కార చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటాం
రహదారులపై వాహనాలను పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. ఐఓసీఎల్‌తో పాటు ఇతర పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల పరిధిలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేసుకునేలా చూస్తాం. అయినప్పటికీ మార్పు రాకుంటే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణ, రూరల్ సీఐ. షాద్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment