కొత్త నిబంధన ప్రవేశపెట్టనున్న టీ సర్కారు
ఐదేళ్ల పాటు వారే నిర్వహించాలి.. పీఎంజీఎస్‌వై తరహాలో అమలు
రహదారుల నాణ్యతకు పెద్దపీటవేసేందుకే త్వరలో రూ.10 వేల కోట్ల పనులకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్ల రోడ్లు.. అన్ని నియోజకవర్గాల కేంద్రాల మీదుగా డబుల్ రోడ్లు.. 10 వేల కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా ఒకేసారి ఏకంగా రూ.10,664 కోట్లతో పనులు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి తెరదీసింది. రోడ్ల నిర్మాణంలో ప్రయోగాత్మకంగా కొత్త నిబంధనను అమలులోకి తెస్తోంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై)లో అనుసరిస్తున్నట్టుగా... ఐదేళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించాలని నిర్ణయించింది. ఫలితంగా రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను అనుసరించకతప్పని పరిస్థితి కల్పించింది. సాధారణంగా రోడ్ల నిర్మాణం అనగానే కాంట్రాక్టర్లకు పండగే అనుకోవటం సహజం. రోడ్లు వేయటం, అనతి కాలంలోనే అవి దెబ్బతినటం, మళ్లీ మరమ్మతులు, ఆ తర్వాత ప్యాచ్‌వర్క్‌లు.. మళ్లీ కొత్త రోడ్ల నిర్మాణం.. ఇది కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తుంటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ (మెయింటెనెన్స్)ను సంబంధిత కాంట్రాక్టర్లే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయిస్తుంది. ఇప్పటి వరకు నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే పర్యవేక్షిస్తూ వస్తోంది. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ‘డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్’ పేరుతో రెండేళ్లు మాత్రమే వాటి నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఈ సమయంలో రోడ్లు దెబ్బతింటే కాంట్రాక్టర్లు వాటిని పునరుద్ధరించాల్సి ఉంటుంది. దీన్ని యథావిధిగా కొనసాగిస్తూ... అదనంగా మూడేళ్లపాటు పాటు నిర్వహణ పనులను కాంట్రాక్టర్లే పర్యవేక్షించే నిబంధనను అమలు చే యనున్నారు.
నాణ్యతను గాలికొదిలేస్తే అంతే..
రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను అనుసరించినా.. వాతావరణ మార్పులు, వాహనాల ఒత్తిడి వల్ల దెబ్బతినటం సహజం. కానీ చాలాచోట్ల రెండేళ్ల తర్వాత రోడ్లు ఉన్నట్టుండి పాడయిపోతున్నాయి. చిన్నపాటి వానకే పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టాల్సి వస్తోంది. ఇందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు రూ.10 వేల కోట్లకుపైగా వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నందున వాటికి ఈ పరిస్థితి ఎదురుకావొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త నిబంధనకు శ్రీకారం చుట్టింది. నిర్వహణ పనుల కోసం కాంట్రాక్టర్లకు నామమాత్రంగానే నిధులు కేటాయిస్తారు. ప్రమాణాలను పాటించి రోడ్లను నిర్మిస్తేనే ఈ మొత్తం సరిపోతుంది. నాణ్యతను గాలికొదిలేస్తే... ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ నిధులు సరిపోక కాంట్రాక్టర్ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఈ భయంతో వారు నిబంధన ప్రకారం నాణ్యతతో రోడ్లను నిర్మిస్తారనేది ప్రభుత్వ ఆలోచన.
వ్యయం ఇలా...
- ప్రస్తుతం రాష్ట్ర రహదారులల్లో ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి (డబుల్ రోడ్డు) రూ.85 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఖర్చవుతోంది.
- సింగిల్ రోడ్డుకు రూ.35 -రూ.45 ల క్షల వరకు ఖర్చవుతోంది.
- ప్రభుత్వ తాజా ప్రణాళికలో.. దాదాపు 4,700 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్లను రెండు లేన్ల రోడ్లుగా మార్చాల్సి ఉంది. ఇందులో నాణ్యత గల్లంతయితే ప్రభుత్వంపై నిర్వహణ భారం విపరీతంగా పడుతుంది.
- కొత్త నిబంధన ప్రకారం.. రోడ్ల నిర్వహణ కోసం ఐదేళ్ల కాలానికి కిలోమీటరుకు రూ.80 వేల చొప్పున మాత్రమే కాంట్రాక్టర్లకు చె ల్లించాలని యోచిస్తున్నారు. రోడ్లు బాగా దెబ్బతింటే ఈ మొత్తం సరిపోదు. అప్పుడు నష్టపోయేది కాంట్రాక్టరే. అందుకే రోడ్డు నిర్మాణం సమయంలో కాంట్రాక్టరు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.