నర్సాపూర్ : పట్టణంలోని హిందూస్థాన్ లివర్ లిమిటెడ్ సంస్థకు చెందిన గోదాంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు రూ. 46 వేలు విలువైన సరుకును అపహరించారు. అయితే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సరుకును తీసుకెళుతున్న వాహనాన్ని వెంబడించడంతో దొంగలు వాహనాన్ని వదలి పారిపోయారు. ఎస్‌ఐ గోపీనాథ్ కథనం మేరకు.. హిందూస్థాన్ గోదాం షెర్టర్‌ను దొంగలు గడ్డపారతో పైకి లేపి లోనికి ప్రవేశించారు. అంతకు ముందు షెట్టర్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాను దొంగలు పనిచేయకుండా చేశారు.
దొంగలు తమతో తెచ్చుకున్న బొలెరో వాహనంలో సబ్బులు, ఇతర సామగ్రిని నింపుకుంటుండగా యజమాని గౌరయ్యగుప్తా గమనించాడు. దీంతో దగ్గరలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఉన్న వాచ్‌మన్‌తో కలిసి అక్కడి వస్తుండడగా గమనించిన దొంగలు వారిపై రాళ్లు రువ్వుతూ వాహనంతో అక్కడి నుంచి ఉడాయించారు. విషయాన్ని గౌరయ్య గుప్త పోలీసుల దృష్టికి తీసుకురావడంతో వారు దొంగల వాహనాన్ని వెంబడించారు.
ఈ మధ్యలో జిన్నారం మండలం బంతపల్లి వద్ద ఉన్న పోలీసు చెక్‌పోస్టు ఇన్‌చార్జ్ ఏఎస్‌ఐ రాంచందర్‌రావుకు సమాచారం అందించారు. ఆయన కూడా సిబ్బందితో వాహనాన్ని వెంబడించడంతో దొంగలు జిన్నారం మండలం అన్నారం సమీపంలో వాహనాన్ని వదిలి పారిపోయారు. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దొంగలు వాడిన వాహనం సైతం చోరీ చేసుకువచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ వాహనం రంగారెడ్డి జిల్లా దారూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డికి చెందినదిగా గుర్తించామన్నారు. కాగా రామిరెడ్డి తన వాహనంలో గత నెల 29 రాత్రి కూరగాయలు నింపుకుని వికారాబాద్ న్యూగంజ్ మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ పాషా వద్దకు వచ్చి తమది మెదక్ జిల్లా సదాశివపేట పట్టణమని, ఇల్లు ఖాళీ చేస్తున్నామని, సామాన్లు వేసుకుపోయేందుకు వాహనం అద్దెకు కావాలని అడిగారు. దీంతో డ్రైవర్ పాషా వారితో కలిసి బయలుదేరాడు. మార్గమధ్యలో డ్రైవర్‌ను బెదిరించి వాహనాన్ని ఆ ఇద్దరూ చోరీ చేశారు. ఈ మేరకు వికారాబాద్‌లో కేసు నమోదైందని ఎస్‌ఐ తెలిపారు.
‘హిందూస్థాన్’ గోదాంలో చోరీ
Published Tue, Nov 18 2014 11:41 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement