పంజగుట్ట : యజమాని ఇంటికే కన్నం వేసిన మహిళను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్‌రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమాజిగూడ ద్వారకా అపార్ట్‌మెంట్‌లో నివసించే ఆర్. రమేష్ యాదవ్ వ్యాపారవేత్త. ఆయన ఇంట్లో గత కొంతకాలంగా పంజగుట్ట పోచమ్మబస్తీకి చెందిన పి.మరియమ్మ(40) పని మనిషిగా ఉంటోంది. ఈ నెల 7వ తేదీన రమేష్ యాదవ్ తన కుటుంబసభ్యులతో నాందేడ్ వెళ్లారు. ఇంటి తాళాలు పని మనిషి మరియమ్మకు ఇచ్చి ఇల్లు శుభ్రంచేసి మంచినీరు పట్టాలని పురమాయించారు.
తిరిగి 12వ తేదీన ఇంటికి చేరుకున్న రమేష్ యాదవ్ కుటుంబం.. లాకర్‌లో ఉన్న రూ.65 వేలు, బీరువాలోని ఒక డైమండ్ నెక్లెస్, మరో చైన్, రెండు సెట్ల డైమండ్ చెవికమ్మలు, రెండు డైమండ్ చేతి ఉంగరాలు కనిపించని విషయం గుర్తించారు. దీనిపై వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియమ్మను విచారించగా ఆమె చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంది. ఆమె ఇంట్లో దాచిన ఏడు లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, రూ.65 వేలు పూర్తిగా స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
పనిచేస్తున్న ఇంట్లోనే చేతివాటం
Published Tue, Mar 15 2016 2:52 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement