ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కంచిపట్టు చీరలు చూపించాలని కొందరు, సాదాసీదా చీరలు చూపించాలని మరి కొందరు మహిళలు రెండు గ్రూపులుగా చీరల దుకాణానికి వచ్చి సేల్స్‌మెన్ దృష్టి మరల్చి చీరలతో ఉడాయించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌లో వయ్యారి వీవ్స్ పేరుతో చీరల షోరూం కొనసాగుతోంది. ఈ నెల 17న సాయంత్రం కొందరుమహిళలు రెండు గ్రూపులుగా ఈ షాప్‌నకు వచ్చారు.
ఒక గ్రూపు మహిళలు కంచిపట్టు చీరలు చూపించాలని సేల్స్‌మెన్‌ను కోరగా ఆయన వాటిని చూపిస్తుండగా కొద్దిసేపటికే మరోగ్రూపు మహిళలు అక్కడికి వచ్చి సాదా చీరలు చూపించాలని కోరారు. సదరు సేల్స్‌మెన్ అటువైపు వెళ్లగానే కంచిపట్టు చీరలు చూస్తున్న మహిళలు వాటిని చాకచక్యంగా దొంగిలించారు. సేల్స్‌మెన్ ఇటు వచ్చిన కొద్దిసేపటికే సాదా చీరలు చూస్తున్న మహిళల బృందం సేల్స్‌మెన్ కళ్లు గప్పి చీరల్ని మూటలో వేసుకున్నారు.
ఈ బృందం వెళ్లిపోయిన తర్వాత చీరలు చూడగా స్టాక్ తక్కువగా కనిపించడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించగా సేల్స్‌మెన్ దృష్టి మరల్చి ఈ రెండు బృందాలు చీరలు దొంగిలించినట్లు గుర్తించారు. దీంతో షోరూం యజమాని తిరుమల రఘురాం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment