సెలూన్‌కు రూ.1.27 లక్షల కరెంట్ బిల్లు
పటాన్‌చెరు: చిన్న హెయిర్ కటింగ్ సెలూన్‌కు వచ్చిన కరెంటు బిల్లు అక్షరాలా రూ.1.27లక్షలు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగికి చెందిన శ్రీనివాస్ స్థానికంగా హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. ప్రతీనెల (విద్యుత్ మీటర్ నంబర్ 0558 02239) రూ.200 నుంచి ఎక్కువలో ఎక్కువ రూ.1,000 వరకు కరెంటు బిల్లు వచ్చేది. అంతకుమందు నెల రూ.971 బిల్లు రాగా జూన్ 28న చెల్లించాడు. ఇక జూలైకి సంబంధించిన బిల్లు ఈ నెల 10న వచ్చింది.
బిల్లు చూసిన శ్రీనివాస్‌కు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. రూ.1,27,751 అంకె చూడగానే అతని గుండె గు‘బిల్లు’మంది. బిల్లుపై జూన్ 14 నుంచి ఆగస్టు 10 వరకు అని, 12,782 యూనిట్లు వినియోగించినట్లు చూపుతోంది. స్థానిక విద్యుత్ అధికారులను సంప్రదిస్తే సంగారెడ్డిలో లోక్ అదాలత్ నిర్వహిస్తారని అప్పుడు నీ సమస్య చెప్పుకోమని ఉచిత సలహా ఇచ్చారు.