రోడ్ల విస్తరణకు రూ.1,500 కోట్లివ్వండి | Rs 1,500 crores for road expansion | Sakshi
Sakshi News home page

రోడ్ల విస్తరణకు రూ.1,500 కోట్లివ్వండి

Published Tue, May 2 2017 12:12 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

రోడ్ల విస్తరణకు రూ.1,500 కోట్లివ్వండి - Sakshi

రోడ్ల విస్తరణకు రూ.1,500 కోట్లివ్వండి

కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి
- పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉప్పల్‌–ఘట్‌కేసర్, ఆరాంఘర్‌– శంషాబాద్‌ మార్గంలో జాతీయ రహదారుల విస్తరణకు రూ.1,500 కోట్లు విడుదల చేయాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. టీ–ఫైబర్, టీ–వర్క్స్‌ ప్రాజెక్టులకు నిధులివ్వా లని, ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు అనుమతు లివ్వాలని ఇతర కేంద్ర మంత్రులను కోరారు. సోమవారం కేటీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంపీలు పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు, పలు విజ్ఞప్తులు చేశారు. అనం తరం వివరాలను మీడియాకు వెల్లడించారు.

రహదారులకు నిధులివ్వండి
జాతీయ రహదారుల విస్తరణ విషయమై సీఎం కేసీఆర్‌ కూడా సోమవారం ఉదయం నితిన్‌ గడ్కరీతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం కేటీఆర్‌ బృందం కలసి విజ్ఞప్తి చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ.. సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక మహబూబ్‌నగర్‌– జడ్చర్ల మార్గంలో 7 కిలోమీటర్ల మేర మిగిలిపోయిన నాలుగు లేన్ల రహదారి పనులకు వెంటనే నిధులు కేటాయించాలని కేటీఆర్‌ కోరారు.

ఫుడ్‌ పార్కులకు అనుమతివ్వండి
రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న నాలుగు ఫుడ్‌ పార్కులకు అనుమతులివ్వాలని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి హర్‌ సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ను కేటీఆర్‌ కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఖమ్మం జిల్లాలోని బుగ్గపాడు ఫుడ్‌ పార్కును, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉన్న పుడ్‌ పార్కులను త్వరితగతిన పూర్తి చేయాలని, అనంతరం కొత్తగా ఫుడ్‌ పార్కుల ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కరీంనగర్‌ డెయిరీకి కోల్డ్‌ స్టోరేజ్‌ లింక్‌ను కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరగా.. సానుకూలంగా స్పందించారు.

టీ–ఫైబర్‌కు ముందస్తు నిధులు
తెలంగాణలో కోటి ఇళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుందని.. కేంద్రం ప్రవేశపెట్టిన భారత్‌ నెట్‌ పథకంలో భాగంగా రాష్ట్రాలకు రావాల్సి న నిధులను అడ్వాన్స్‌గా విడుదల చేయాలని కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హాను కేటీఆర్‌ కోరారు. మిషన్‌ భగీరథతో కలిపి చేపడుతుండడంతో టీ–ఫైబర్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని.. అందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధు లను ముందస్తుగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే నిధులు విడుదల చేయడంలో తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని, దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో చర్చించాలని మనోజ్‌ సిన్హా సూచించినట్టు భేటీ అనంతరం కేటీఆర్‌ తెలిపారు. తమ శాఖ తరఫున కూడా ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు.

టీ–వర్క్‌కు సహకరించండి..
టీ–హబ్‌ మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ–వర్క్‌కు సహకరించాలని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యా క్చరింగ్, మెడికల్‌ ఎలక్ట్రానిక్స్, కన్సూమర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణకు ఐటీఐఆర్‌ మంజూరు చేస్తామని ప్రకటించి పక్కన పెట్టేశారని.. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రులను కలసిన వారిలో పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌ కుమార్, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.

రైతుల ముసుగులో కాంగ్రెస్, టీడీపీల కుట్ర
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రైతుల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయని.. రైతుల ముసుగులో ఖమ్మం మిర్చి యార్డులో విధ్వంసానికి పాల్పడ్డాయని కేటీఆర్‌ ఆరోపించారు. దేశంలో ఏ రైతు కూడా అన్నం పెట్టే మార్కెట్‌ యార్డును తగల బెట్టుకోడన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని.. రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఎకరాకు రూ.4 వేల చొప్పున ఎరువులు, విత్తనాల కొను గోలుకు ప్రభుత్వం నిధులు ఇవ్వబోతోం దని తెలిపారు. రైతుల్లో ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీలు.. తెలంగాణలో అశాం తి నెలకొల్పేందుకు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement