సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గత ఐదేళ్లలో వివిధ రకాల పన్నుల రూపంలో రూ.27,467 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.13,105 కోట్లు, కేంద్రానికి రూ.14,362 కోట్లను పన్నులు, ఇతర రూపాల్లో చెల్లించింది. గత ఐదేళ్లలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, లాభాల్లో గణనీయ వృద్ధి సాధించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు కూడా భారీగా పెరిగాయి.
ఐదేళ్లలో రెట్టింపైన పన్నులు
వివిధ సంస్థల మాదిరిగానే సింగరేణి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలురకాల పన్నులు, డివిడెండ్ల రూపంలో సొమ్ము చెల్లిస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్, స్టేట్ జీఎస్టీ, కాంట్రాక్టు ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, రాయల్టీ వంటి 9 రకాల పన్నులు చెల్లిస్తోంది. కేంద్రానికి డివిడెండ్‌తో పాటు సెంట్రల్ జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, స్వచ్ఛ భారత్ సెస్, కృషి కల్యాణ్ సెస్, జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్, క్లీన్ ఎనర్జీ సెస్, ఎన్‌ఎంఈటీ వంటి 21 రకాల పన్నులను ఏటా చెల్లిస్తోంది. 2014–15లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,996.58 కోట్లు, కేంద్రానికి రూ.1,863.11 కోట్లు కలిపి మొత్తం రూ.3,859.69 కోట్లు చెల్లించింది. 2018–19లో రాష్ట్రానికి రూ.3,348.4 కోట్లు, కేంద్రానికి రూ.3,680.45 కోట్లు కలిపి మొత్తం రూ.7,028.85 కోట్లు చెల్లించింది.
ఏ పన్ను ఎంత?
గత ఐదేళ్ల కాలంలో సింగరేణి రాయల్టీల రూపంలో రూ. 8,678.82 కోట్లను రాష్ట్ర ఖజానాకు చెల్లించింది. రూ.1,240.67 కోట్ల వ్యాట్, రూ.485.33 కోట్ల సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, రూ.342.05 కోట్ల స్టేట్ జీఎస్టీ, రూ.78.83 కోట్ల వర్క్ కాంట్రాక్టు ట్యాక్స్, రూ.66.94 కోట్ల ఎంట్రీ ట్యాక్స్ చెల్లించింది. దీనికి అదనంగా డివిడెండ్‌ల రూపంలో రాష్ట్రానికి ఐదేళ్లలో రూ.420.66 కోట్లు చెల్లించింది. కేంద్రానికి చెల్లిస్తున్న వాటిలో క్లీన్ ఎనర్జీ సెస్‌దే అగ్రస్థానం. గత ఐదేళ్లలో రూ.4,864.41 కోట్ల క్లీన్ ఎనర్జీ సెస్ చెల్లించింది. రూ.4,095.86 కోట్ల జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్, రూ.2,441.56 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్, రూ.986.64 కోట్ల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.395.73 కోట్ల సర్వీస్ ట్యాక్స్, రూ.342.05 కోట్ల సెంట్రల్ జీఎస్టీ, రూ.201.37 కోట్ల స్టోయింగ్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.124.42 కోట్ల కస్టమ్స్ డ్యూటీ చెల్లించింది. దీనికి అదనంగా గత ఐదేళ్లకు కేంద్రానికి రూ.402.6 కోట్ల డివిడెండ్లను చెల్లించింది.
6 జిల్లాల అభివృద్ధికి రూ.1,844 కోట్లు
సింగరేణి గనులు విస్తరించిన 6 జిల్లాల్లోని సమీప గ్రామాల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కార్యక్రమం కింద సింగరేణి సంస్థ 2016–17 నుంచి 2019 ఏప్రిల్ వరకు రూ.1,844 కోట్లు సంబంధిత జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి చెల్లించింది.
రూ.27,467 కోట్ల పన్నులు!
Published Sat, Jun 8 2019 2:19 AM | Last Updated on Sat, Jun 8 2019 2:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment