అంజన్నజాగ.. వేశారు పాగా..
పరాధీనంలో ‘ఊళ్లో ఆంజనేయుడు’
రూ.5 కోట్ల ఆలయ భూములు కబ్జా
1.20 ఎకరాల స్థలం అన్యాక్రాంతం
తప్పుడు సర్వే నంబర్లతో నిర్మాణాలు
పురాణాల్లో బలానికి ప్రతిరూపం ఆంజనేయుడు. ఆయనంతటి శక్తివంతుడు ఇంకెవరూ లేరనేది భక్తుల నమ్మకం. ఇలా.. బలానికి, శక్తికి మారుపేరుగా ఉన్న ఆంజనేయుడి ఆలయ భూములకు మాత్రం రక్షణ లేకుండా పోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ‘ఊళ్లో ఆంజనేయస్వామి’ ఆలయానికి చెందిన రూ.5 కోట్ల విలువైన భూములు కబ్జా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.
వరంగల్ :రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న హన్మకొండ మచిలీబజార్‌లోని ఊళ్లో ఆం జనేయస్వామి ఆలయ భూములపై కబ్జా దారుల కన్ను పడింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 817లో 1.2 ఎకరాల భూమి ఉంది. వరంగల్ నగరం నడిబొడ్డున భద్రకాళి చెరువు కట్ట కింది భాగంలో ఈ స్థలం ఉంది. ప్రస్తుతం నగరంలోని ఇతర ప్రాం తాలతోపాటు ఇక్కడి భూముల ధరలు భారీగా పెరిగాయి. ఆలయానికి చెందిన ఈ భూముల విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది. విలువైన ఈ భూములపై కొందరు కన్నేశారు. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి రియల్ వెంచర్‌గా మర్చేశారు. ఆలయూనికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమి ని కబ్జా చేసి అమ్మకానికి పెట్టినా... అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్ 817 లోని 1.2 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని... పక్కన ఉన్న వేరే సర్వే నంబర్‌లో ఉన్నట్లుగా పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మకానికి పెట్టినట్లు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులకు చాలా ఫిర్యాదులు అందారుు. అరుునా.. అధికారుల నుంచి కనీస స్పందన కనిపించలే దు. ఆలయానికి చెందిన స్థలంలో నిర్మాణాలు జరుగుతుండడంతో భక్తులకు అనుమానం వచ్చింది. తప్పుడు పత్రాలతో ఆలయ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని, వాటి ని నిలిపివేసి భూములను పరిరక్షించాలని పలువురు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు యం త్రాంగం జోక్యం చేసుకుంది. ఫిర్యాదు అంశా ల్లో స్పష్టత వచ్చేవరకు స్థలంలో నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అధికారుల తీరు... అనుమానాలు !
ఉన్నతాధికారులకు ఫిర్యాదు తర్వాత ఆలయ భూముల్లో నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపేసినా.... రాత్రివేళల్లో ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెడీమేడ్ పిల్లర్లతో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశాలపై తాజాగా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులను కలిసినా... ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం భూములపై స్పష్టత వచ్చేవరకు ఆగకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. భూములు ఆలయానికి సంబంధించినవా... లేదా... తేల్చే పని చేయాల్సిన అధికారులు ఈ విషయాన్ని పక్కనబెడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. భక్తులు ఆరోపిస్తున్నట్లుగా తప్పుడు పత్రాలతో ఆలయ భూములు కబ్జా చేసి, అమ్మకానికి పెట్టిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది.