
రూ.54 కోట్లు
మూడు నెలల విరామం తరువాత డిసెంబర్ నెలలో వరుస పెళ్లిళ్లు జరగడం, దానికి 31 సంబురాలు తోడవడంతో జిల్లాలో మద్యం అమ్మకాలు విపరీతంగా జరిగాయి.
మంచిర్యాల రూరల్ : మూడు నెలల విరామం తరువాత డిసెంబర్ నెలలో వరుస పెళ్లిళ్లు జరగడం, దానికి 31 సంబురాలు తోడవడంతో జిల్లాలో మద్యం అమ్మకాలు విపరీతంగా జరిగాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.54 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ జరుపుకునే 31న రూ.15 కోట్లకు పైగా వ్యాపారం అయ్యింది.
జిల్లాలో రెండు మద్యం డిపోలు ఉన్నాయి. మంచిర్యాల, ఉట్నూర్‌లో ఉండగా.. 157 మద్యం దుకాణాలు, రెండు ప్రభుత్వ మద్యం ఔట్‌లెట్లు, 22 బార్లు ఉన్నాయి. ఈ మద్యం డిపో పరిధిలో కేవలం డిసెంబర్ నెలలోనే 2.22 లక్షల పెట్టెల మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖకు రూ. 54 కోట్ల ఆదాయం వచ్చింది. 2013 డిసెంబర్‌లో రూ.48 కోట్ల మద్యం అమ్ముడు పోగా.. ఈసారి ఆరు కోట్ల మద్యం అదనంగా సరఫరా అయ్యింది.
ఏటా పెరుగుతున్న విక్రయాలు..
జిల్లాలో మద్యం విక్రయాలు ఏటా పెరుగుతున్నాయి. మంచిర్యాల మద్యం డిపో పరిధిలో 64 మద్యం దుకాణాలు, రెండు ప్రభుత్వ ఔట్‌లెట్లు, ఆరు బార్లు ఉన్నాయి. ఇక్కడ డిసెంబర్ నెలలో 81,267 మద్యం పెట్టెలు అమ్ముడు పోగా, రూ.19.53 కోట్ల ఆదాయం వచ్చింది. ఉట్నూరు మద్యం డిపో పరిధిలో 93 మద్యం దుకాణాలు, 16 బార్లు ఉండగా, 1,40,739 మద్యం పెట్టెలు అమ్మగా, రూ.33.56 కోట్ల ఆదాయం చేకూరింది.
మద్యం అమ్మకాలు జిల్లాలో 2013 డిసెంబరులో 2,02,500 మద్యం పెట్టెలు పోగా, 2014 డిసెంబరు నెలలో 2,22,006 పెట్టెలు అమ్ముడయ్యాయి. ఏడాదిలో 19,506 పెట్టెల అమ్మకాలు పెరిగాయి. దీంతో ఏడాదిలో రూ.6 కోట్ల ఆదాయం పెరిగింది. 2013లో మద్యం దుకాణాలు 174 ఉంటే, ఈ ఏడాది 159 దుకాణాలే నడుస్తున్నాయి.
దుకాణాల సంఖ్య తగ్గినా మద్యం అమ్మకాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టుషాపుల్లోనే మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జిల్లాలో బెల్టుషాపుల నిర్వహణతోనే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండగా, వాటిని నియంత్రించే ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టడం కొసమెరుపు.