విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లు
మార్చి నుంచి నిరంతరం సరఫరా
రఘుమారెడ్డి వెల్లడి
జగదేవ్‌పూర్: వచ్చే నాలుగేళ్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.95 వేల కోట్లతో యాక్షన్‌ప్లాన్ తయారు చేశామని టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి తెలిపారు. అలాగే 5 వేల సౌరవిద్యుత్ మెగావాట్లకు ప్లాన్ చేశామని, మార్చిలోపు కరెంట్ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018-19కు నాటికి 24 వేల మెగావాట్ల విద్యుత్ కోసం రూ. 95 వేల కోట్లతో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే రూ.5 వేల కోట్లతో సౌరవిద్యుత్ కోసం ప్లాన్ చేస్తున్నామన్నారు. 2 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కోసం టెండర్లు పిలిచామన్నారు. రూ. 2 వేల కోట్లతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు కరెంట్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సీఎం నిర్వహించే అయుత చండీయాగానికి విద్యుత్ సమస్య లేకుండా గజ్వేల్ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లలో మరమ్మతు పనులు చేశామని చెప్పారు.