వాగ్దానాలు విస్మరించిన పార్టీల గుర్తింపు రద్దు చేయాలి
రైతు సంఘాల డిమాండ్
హైదరాబాద్: రైతులకు రూ.లక్ష వరకు రుణం మాఫీ చేసేలా రాజకీయ పార్టీలు హామీ ఇవ్వాలని, ఇదే విషయాన్ని ఎన్నికల ప్రణాళికల్లోనూ చేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మేనిఫెస్టోలోని వాగ్దానాలను విస్మరించే పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి గుర్తింపును రద్దుచేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. ‘2014 ఎన్నికలు- పార్టీ ప్రణాళికల్లో పొందు పర్చాల్సిన అంశాల’పై మంగళవారం హైదరాబాద్‌లో సీపీఐ అనుబంధ రైతు సంఘం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిం చింది.
సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కె.నారాయణ (సీపీఐ), బి.చంద్రారెడ్డి (సీపీఎం అనుబంధ రైతుసంఘం), ఎం.కోదండరెడ్డి (కాంగ్రెస్ కిసాన్‌సెల్), ఎంవీఎస్ నాగిరెడ్డి (వైఎస్సార్‌సీపీ రైతు విభాగం), ఎన్.వెంకటేశ్వరరావు (టీడీపీ రైతు సంఘం), శ్యాంకిషోర్ (బీజే పీ కిసాన్‌మోర్చా), గాదె దివాకర్ (న్యూడెమోక్రసీ), డాక్టర్ డి.నరసింహారెడ్డి (చేతనసొసైటీ), కిరణ్ (ఆమ్ ఆద్మీ), ఎస్.సురేష్‌రెడ్డి (బీజేపీ), రావుల వెంకయ్య, కె.రామకృష్ణ (ఏపీ రైతు సంఘం) తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రతిపాదించిన అంశాలను తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తామని నారాయణ హామీ ఇచ్చారు.
రైతు ఒక్కొక్కరికీ రూ.లక్ష వరకు రుణం మాఫీ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించేలా పార్టీల ప్రణాళికలు ఉండాలని కోరింది. రైతులకు ఇచ్చే రుణాలపై ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించకుండా చట్టాలు తేవాలని డిమాండ్ చేసింది. 55 ఏళ్లు నిండిన ప్రతి రైతు, రైతు కూలీకి నెలకు రూ. 3వేల పింఛన్ సౌకర్యం కల్పించాలని సమావేశం తీర్మానించింది.
రూ. లక్ష రుణం మాఫీకి కట్టుబడాలి
Published Wed, Apr 2 2014 2:46 AM | Last Updated on Mon, Oct 1 2018 5:09 PM
Advertisement
Advertisement