రూ. లక్ష చెల్లిస్తే సోలార్ పంపుసెట్టు | Rs. Lakh paid Solar pump set | Sakshi
Sakshi News home page

రూ. లక్ష చెల్లిస్తే సోలార్ పంపుసెట్టు

Published Wed, Feb 11 2015 3:54 AM | Last Updated on Mon, Oct 22 2018 8:40 PM

Rs. Lakh paid Solar pump set

- నాబార్డు ఆర్థిక సాయంతో రెండు రాష్ట్రాలకు 3 వేల సెట్లు మంజూరు
- యూనిట్ ధర రూ. 5 లక్షలు... రైతుకు 2.16 లక్షలు సబ్సిడీ

సాక్షి, హైదరాబాద్: రైతు ముందుగా లక్ష రూపాయలు చెల్లిస్తే సోలార్ విద్యుత్ పంపుసెట్టు ఇచ్చేందుకు నాబార్డు ముందుకు వచ్చింది. ఆ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 3 వేల సోలార్ పంపుసెట్లు మంజూరు చేస్తూ నాబార్డు మంగళవారం నిర్ణయించింది. 5 హెచ్‌పీ సోలార్ విద్యుత్ పంపుసెట్టు యూనిట్ ధర రూ. 5 లక్షలు. అందులో నాబార్డు సబ్సిడీ 43.2 శాతం అంటే రూ.2.16 లక్షలు పోను మిగిలిన రూ. 2.84 లక్షలు రైతులు భరించాల్సి ఉంటుంది.

అయితే, రైతు తనవాటాలో ముందుగా లక్ష రూపాయలు చెల్లిస్తే... మిగిలిన సొమ్ముకు బ్యాంకులు రుణం విడుదల చేస్తాయి. ఈ రుణాన్ని వడ్డీ లేకుండా రైతు మూడేళ్ల వరకు చెల్లించవచ్చు. దీంతో రైతుపై భారం ఉండబోదని నాబార్డు పేర్కొంటోంది.  రైతు లక్ష రూపాయలు చెల్లించాక సంబంధిత కంపెనీ సోలార్ విద్యుత్ పంపుసెట్టును అమర్చుతుంది.
 బ్యాంకుల ద్వారానే దరఖాస్తులు: నాబార్డు, బ్యాంకుల ద్వారానే సోలార్ విద్యుత్ పంపుసెట్లు రైతులకు అందుతాయి. కంపెనీలు, టెండర్లు అన్నీ నాబార్డు ఆధ్వర్యంలోనే సాగుతాయి.  

వాణిజ్య, సహకార బ్యాంకుల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. భూమి రికార్డులు, పాసు పుస్తకాలు తదితరాలు దరఖాస్తుతో జతచేసి అదే బ్యాంకులో అందజేయాల్సి ఉం టుంది. ఈ మేరకు నాబార్డు ఆయా బ్యాంకులకు ఆదేశాలు ఇస్తుంది. ఇదిలావుండగా రెండురాష్ట్రాలకు కలిపి నాబార్డు పనిచేస్తున్నందున ఏ రాష్ట్రానికి ఎన్ని సోలార్ విద్యుత్ పంపుసెట్లు మంజూరు చేశారన్న విషయాన్ని విడిగా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement